Congress: 'పుల్వామా దాడి'పై మోదీ, ఇమ్రాన్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది: కాంగ్రెస్
- హరిప్రసాద్ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ
- కాంగ్రెస్ నేత హద్దులు దాటారంటూ మండిపాటు
- రాఫెల్ కేంద్ర బిందువుగా ముదురుతున్న రాజకీయాలు
రాఫెల్ స్కాం కేంద్ర బిందువుగా బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ, పుల్వామా దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. లేకపోతే, పుల్వామా ఉగ్రదాడి జరగాల్సిన ఘటన కానేకాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాఫెల్ స్కాంపై పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ బీకే హరిప్రసాద్ తాజా ఆరోపణలు చేశారు. రూ.30,000 కోట్ల స్కాంలో ప్రధానిపై ఎందుకు విచారణ జరపకూడదు? అని రాహుల్ ప్రశ్నించగా, రాహుల్ కు భారత వ్యవస్థలపైనే నమ్మకం లేదంటూ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ విరుచుకుపడ్డారు.
అయితే రాహుల్ కు మద్దతుగా రంగంలోకి దిగిన బీకే హరిప్రసాద్ ఏకంగా మోదీని టార్గెట్ చేసి తీవ్ర కలకలం రేపారు. పుల్వామా దాడిపై కేంద్రం వద్ద ముందస్తు సమాచారం ఉందని అన్నారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ దీనికి జవాబివ్వాలని హరిప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో మోదీ, ఇమ్రాన్ మ్యాచ్ ఫిక్సింగ్ పై రవిశంకర్ ప్రసాద్ వివరణ ఇవ్వాలని అడిగారు. మోదీ, ఇమ్రాన్ లకు తెలియకుండా పుల్వామా ఘటన జరిగేదే కాదని స్పష్టం చేశారు. పుల్వామా దాడి తదనంతర పరిణామాలు చూస్తే, మోదీ, ఇమ్రాన్ లాలూచీ అందరికీ అర్థమవుతుందని ఆరోపించారు.