Andhra Pradesh: చంద్రబాబు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు: వైఎస్ జగన్
- ప్రజల వ్యక్తిగత వివరాలను బాబు అమ్ముకుంటున్నారు
- ‘ఇది నా డేటా’ అని బాబు బుకాయింపు
- ఏపీ పోలీస్ ను తన వాచ్ మన్ లా చంద్రబాబు వాడుకుంటున్నారు
ప్రజల వ్యక్తిగత సమాచారం చౌర్యంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. నెల్లూరులో నిర్వహించిన వైసీపీ సమర శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ, ప్రజల వ్యక్తిగత వివరాలు అమ్ముకుంటూ ‘ఇది నా డేటా’ అని చంద్రబాబు వ్యాఖ్యానించడం దారుణమని, దొంగతనం చేస్తూ పట్టుబడ్డ బాబు ప్రజలకు క్షమాపణలు చెప్పకుండా ‘దొంగా..దొంగా’ అంటూ అరుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు బినామీ కంపెనీలపై పోలీసులు దాడులు చేస్తే, ఆంధ్రా పోలీసులను అక్కడికి పంపారని, ఏపీ పోలీసులను తన వాచ్ మన్ లాగా బాబు వాడుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదని, రాష్ట్రంలో 39 లక్షలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు.