India: పుల్వామా బాధితులకు రూ.110 కోట్లు ఇస్తా... నా టెక్నాలజీ వాడుకోండి!: ఓ అంధ శాస్త్రవేత్త విజ్ఞప్తి
- దేశానికి సేవగా భావిస్తాను
- నా టెక్నాలజీ వాడితే పుల్వామా ఘటన జరిగేది కాదు
- పీఎంఓకి ఈమెయిల్ పంపిన ముంబయి వాసి
పుల్వామా ఉగ్రదాడి అమరవీరుల కుటుంబాలకు కనీవినీ ఎరుగని రీతిలో రూ.110 కోట్ల అతి భారీ విరాళం ప్రకటించాడో ముంబయి నివాసి. ఆయన పేరు ముర్తజా ఏ హమీద్. వయసు 44 ఏళ్లు. కోటా ప్రాంతానికి చెందిన ఆయన జన్మతః అంధుడు. అయితే, కామర్స్ లో గ్రాడ్యుయేషన్ చేసిన హమీద్ ప్రస్తుతం ముంబయిలో పరిశోధకుడిగా పనిచేస్తున్నారు.
తాను సక్రమంగా ట్యాక్స్ లు చెల్లిస్తున్న సొమ్మునే విరాళంగా ఇస్తున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిన ఓ ఈమెయిల్ లో తెలిపారు. తన విరాళాన్ని ప్రధానమంత్రి జాతీయ నిధికి అందజేస్తానని పేర్కొన్నారు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇప్పించాలని కోరారు. మాతృభూమి కోసం తమ ప్రాణాలను త్యాగం చేస్తున్న జవాన్ల కోసం ఏదైనా చేయాలన్న తపనతోనే ఈ విరాళం ప్రకటించినట్టు వివరించారు. ఈ సందర్భంగా హమీద్ ఫోన్ లో మాట్లాడుతూ ఆశ్చర్యం కలిగించే వ్యాఖ్యలు చేశారు.
తాను కనుగొన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం ఆమోదించి ఉంటే పుల్వామా ఘటన జరిగేది కాదన్నారు. తాను కొంతకాలం కిందట 'ఫ్యూయల్ బర్న్ రేడియేషన్ టెక్నాలజీ' ఆవిష్కరించానని, దాని సాయంతో జీపీఎస్ ,కెమెరా అవసరం లేకుండానే ఓ వాహనం కానీ, ఓ వస్తువు కానీ ఎక్కడుందో తెలుసుకోవచ్చని వివరించారు. దీన్ని ఎలాంటి లాభాపేక్ష లేకుండా పూర్తి ఉచితంగా అందిస్తానని 2016లో కేంద్ర ప్రభుత్వంతో పాటు నేషనల్ హైవేస్ అథారిటీకి ప్రతిపాదనలు పంపానని వెల్లడించారు హమీద్. ప్రాథమిక పరిశీలన కోసం ఆమోదం తెలుపుతూ రెండేళ్ల తర్వాత బదులిచ్చారని, ఆ తర్వాత దానిపై ముందడుగు పడలేదని అన్నారు.
అయితే, మీరు కామర్స్ చదివి సైన్స్ కు సంబంధించి ఎలా పరిశోధనలు చేస్తున్నారని ప్రశ్నించగా... 2010లో జైపూర్ లో ఓ పెట్రోల్ పంప్ వద్ద జరిగిన అగ్నిప్రమాదం తనను పరిశోధనల దిశగా పురిగొల్పిందని చెప్పారు. ద్రవరూపంలో ఉండే ఇంధనం ఎలా మండుతుంది అనే దిశగా పరిశోధనలు సాగించానని, దాని గురించి సమగ్రంగా అధ్యయనం చేశానని పేర్కొన్నారు.