ఒక 19 ఏళ్ల కుర్రాడు మానవబాంబుగా ఎందుకు మారాడో అర్థం చేసుకోండి: ఇమ్రాన్ ఖాన్
- గతంలో కశ్మీరీ నాయకులు భారత్ నుంచి విడిపోవాలని కోరుకోలేదు
- ఇప్పుడు అందరూ స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటున్నారు
- ఏ తప్పు జరిగినా రెండు దేశాలు నాశనమైపోతాయి
ఒక 19 ఏళ్ల కుర్రాడు మానవబాంబుగా ఎందుకు మారాడో అర్థం చేసుకోవాలని ఇమ్రాన్ అన్నారు. చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తూ... సరికొత్త ఫలితాన్ని రాబట్టాలనుకోవడమనేది 'ఐన్ స్టీన్ థియరీ ఆఫ్ మ్యాడ్ నెస్' అని చెప్పారు. కశ్మీర్ లో జరుగుతున్న పరిణామాలకు పాకిస్థాన్ ను ఎంతకాలం నిందిస్తారని ప్రశ్నించారు. ఆధారాలు చూపకుండానే చర్యలు తీసుకోవాలని ఎలా అడుగుతారని చెప్పారు. ఆత్మాహుతి దాడులను ఇస్లామిక్ రాడికలిజం అని అంటున్నారని... హిందూమతానికి చెందిన తమిళ టైగర్లు ఇదే విధంగా దాడులు చేసేవారని గుర్తు చేశారు.
ఆత్మాహుతి దాడులకు, మతానికి సంబంధం లేదని ఇమ్రాన్ చెప్పారు. బలహీనతలు, నిరాశ వల్ల కొందరు ఇలాంటి దాడులకు తెగబడతారని అన్నారు. ప్రస్తుత భారత ప్రభుత్వం యుద్ధానికి సైతం సిద్ధమవుతున్న తీరును భారత ప్రజలు అంగీకరించడం లేదని చెప్పారు. గత 17 ఏళ్లుగా పాక్ మీడియా ఏం చేసిందో భారత మీడియా గమనించినట్టైతే... యుద్ధ వాతావరణాన్ని సృష్టించే విధంగా కథనాలను ప్రసారం చేయదని అన్నారు. సమస్యకు యుద్ధం పరిష్కారం కాదని చెప్పారు. ఏ తప్పు జరిగినా రెండు దేశాలు నాశనమైపోతాయని అన్నారు. పరిస్థితి చేయి దాటకుండా చూడాలని సూచించారు. లేనిపక్షంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని చెప్పారు.