Tollywood: అత్యంత దయనీయ స్థితిలో హీరోయిన్ విజయలక్ష్మి.. ఆసుపత్రి బిల్లుకు కూడా డబ్బుల్లేవు!
- బెంగళూరులో చికిత్స
- దాతల సాయం కోసం ఎదురుచూపులు
- తల్లికి సైతం తీవ్ర అనారోగ్యం
తెలుగులో హనుమాన్ జంక్షన్ సినిమాలో చెల్లెలి పాత్ర పోషించిన విజయలక్ష్మి పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా ఉంది. హనుమాన్ జంక్షన్ చిత్రంలో విజయలక్ష్మి హీరోలు జగపతిబాబు, అర్జున్ లకు సోదరిగా నటించింది. అందులో ఆమె హీరో వేణుకు జోడీ. కన్నడలో ఆమె నాగమండల, సూర్యవంశ వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం ఆమె టెలివిజన్ సీరియల్స్ కే పరిమితమైంది. అయితే ఇటీవల విజయలక్ష్మి తల్లి తీవ్ర అనారోగ్యం బారినపడి ఆసుపత్రిపాలైంది. ఉన్న డబ్బంతా తల్లి కోసమే ఖర్చు చేసింది విజయలక్ష్మి. అంతలోనే తాను సైతం అనారోగ్యంపాలైంది. ఆమె హైబీపీతో ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఒక దశలో పరిస్థితి విషమంగా మారడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. దాంతో విజయలక్ష్మి కుటుంబం ఆసుపత్రి బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. ఈ మేరకు విజయలక్ష్మి సోదరి ఉషాదేవి ఓ ప్రకటన చేసింది.
తన తల్లి, సోదరి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, తమ వద్ద ఉన్న డబ్బంతా అయిపోయిందని, ఎవరైనా ముందుకొచ్చి సాయంచేస్తేనే తల్లిని, సోదరిని కాపాడుకోగలనని దీనంగా వేడుకుంది ఉషాదేవి. తమిళంలో సూర్యా సరసన ఫ్రెండ్స్ అనే చిత్రంలో నటించిన విజయలక్ష్మి కొద్దికాలంగా సినిమా అవకాశాలు తగ్గడంతో కన్నడ సీరియల్స్ లో నటిస్తోంది. ఆరోగ్యం సహకరించకపోవడంతో సీరియల్ అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేతిలో చిల్లిగవ్వ లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. అయితే ఆమె సోదరి ఉషాదేవి చేసిన ప్రకటనతో కన్నడ ఫిలించాంబర్ స్పందించి ఆర్థికసాయం అందజేసింది. విజయలక్ష్మి త్వరగా కోలుకోవాలని ఫిలించాంబర్ సభ్యులు ఆకాంక్షించారు. ప్రస్తుతం విజయలక్ష్మి బెంగళూరులోని మాల్యా హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.