Chandrababu: జగన్ ఆటలు ఏపీలో సాగవు: సీఎం చంద్రబాబు
- జగన్, కేసీఆర్, మోదీ తమపై కుట్రలు చేస్తున్నారు
- ప్రజలకు జగన్ మాయమాటలు చెబుతున్నారు
- గిరిజనులకు న్యాయం చేసింది టీడీపీయే
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. జగన్ ఆటలు ఏపీలో సాగవని అన్నారు. జగన్, కేసీఆర్, మోదీ తమపై కుట్రలు చేస్తున్నారని, ప్రజలకు జగన్ మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. ఒక అవినీతిపరుడికి కేంద్రం ఎలా సపోర్ట్ చేస్తుందని ప్రశ్నించారు. కేంద్రం మనపై సీబీఐ దాడులు చేయించిందని, ఏపీకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని మరోమారు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ గురించి ప్రస్తావిస్తూ, అవినీతి సొమ్ము తెస్తామని, దేశాన్ని మార్చేస్తామని చెప్పిన మోదీ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గిరిజనులకు న్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, గతంలో బాక్సైట్ లైసెన్స్ లను తానే రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఒక వ్యక్తి రాజకీయ ప్రయోజనాల కోసం సమస్యలు సృష్టించారని, ట్రైబల్ ఏరియాలో ఉండే సంపదను విదేశాలకు తరలించారని, గిరిజనుల సంపదను వైెఎస్ ఇతరులకు దోచిపెట్టారని ఆరోపించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు మంచి చదువు చెప్పిస్తామని అన్నారు. ఈరోజు టీడీపీలో చేరిన కిశోర్ చంద్రదేవ్ గురించి చంద్రబాబు ప్రస్తావించారు. కిశోర్ చంద్రదేవ్ లాంటి వ్యక్తి ఎంపీగా ఉండాలని అన్నారు. రౌడీల పార్టీలోకి పోలేకే ఆయన తమ పార్టీలో చేరారంటూ పరోక్షంగా వైసీపీపై వ్యాఖ్యలు చేశారు.