Tollywood: ఇంటి ఓనర్ ను తీసుకొచ్చి విలన్ గా మార్చిన ఘనత కోడి రామకృష్ణదే: పరుచూరి గోపాలకృష్ణ
- ఎంతోమందిని పరిచయం చేశారు
- నటన తెలియని వాళ్లను నటులుగా మలిచారు
- ఆసక్తికర సంగతులు చెప్పిన పరుచూరి
దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతూ గచ్చీబౌలీలోని ఏఐజీ ఆసుపత్రిలో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు కోడి రామకృష్ణ. ఆయన మృతి పట్ల టాలీవుడ్ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని చిత్రసీమ ప్రముఖులు చెమర్చిన కళ్లతో సంతాప వచనాలు పలుకుతున్నారు.
తాజాగా, సుప్రసిద్ధ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ కోడి రామకృష్ణ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన క్రెడిట్ కోడి రామకృష్ణకే దక్కుతుందని అన్నారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో గొల్లపూడి మారుతీరావుకు మంచి గుర్తింపు తెచ్చింది కోడి రామకృష్ణేనని తెలిపారు.
అయితే అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా పరుచూరి ఈ సందర్భంగా వెల్లడించారు. అప్పట్లో అంకుశం చిత్రం కోసం విలన్ కావాల్సి వస్తే తన ఇంటి ఓనర్ నే విలన్ గా పరిచయం చేసిన ధీశాలి అని వివరించారు. ఆ ఇంటి ఓనర్ ఎవరో కాదని, రామిరెడ్డి అని తెలిపారు. అంకుశం చిత్రం తర్వాత రామిరెడ్డి స్థాయి ఏ రేంజ్ కి చేరిందో అందరికీ తెలుసన్నారు. నటులు కానివారిని కూడా నటులుగా మలచడం ఆయనకే చెల్లిందన్నారు.