Tollywood: గోపీచంద్ ఆరోగ్యంపై తాజా సమాచారం అందించిన దర్శకుడు సంపత్ నంది
- బైక్ ప్రమాదంలో ఆసుపత్రిపాలైన హీరో
- షూటింగ్ నిలిపివేత
- త్వరలో చిత్రీకరణ షురూ
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ప్రమాదవశాత్తు షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. తన కొత్త చిత్రం కోసం జైపూర్ లో యాక్షన్ సీన్స్ లో పాల్గొంటున్న గోపీచంద్ బైక్ పై నుంచి కిందపడ్డారు. ఈ ఘటనలో గోపీకి స్వల్పగాయాలు అయ్యాయి. దాంతో షూటింగ్ నిలిపివేసి హీరోను స్థానిక ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. దీంతో 'హీరో గోపీచంద్ కు ప్రమాదం' అంటూ మీడియాలో వస్తున్న వార్తలు చూసి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు సంపత్ నంది హీరో గోపీచంద్ ఆరోగ్యంపై తాజా సమాచారం అందించారు. గోపీచంద్ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గోపీచంద్ క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. జైపూర్ హాస్పిటల్ లో గోపీచంద్ ను కలిశానని, ఆయన కులాసాగా ఉన్నారని వివరించారు. దేవుడి దయ, అభిమానుల ఆశీర్వాదాలు... గోపీచంద్ ను ప్రమాదం నుంచి కాపాడాయని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అంటూ సంపత్ నంది విజ్ఞప్తి చేశారు.
రాజస్థాన్ లోని భారత్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో స్టంట్స్ చిత్రీకరిస్తుండగా బైక్ అదుపుతప్పి గోపీచంద్ కిందపడిపోయినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. తమిళ దర్శకుడు తిరు ఈ భారీ యాక్షన్ ఎంటర్టయినర్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.