YSRCP: చంద్రబాబు లాంటి మనిషిని మనం ఏమనాలి?: వైఎస్ జగన్
- చంద్రబాబు తన సినిమా-2లో డైలాగ్స్ కొడుతున్నారు
- బాబును ‘అన్నా’ అనాలా? ‘దున్నా’ అనాలా?
- ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తొస్తున్నారు!
ఏపీలో ఎన్నికలు వస్తున్నాయంటే పోలీసులతో గూండాగిరి చేయిస్తారని, వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆ పార్టీ అధినేత జగన్ ఆరోపించారు. తిరుపతిలో నిర్వహిస్తున్న ‘సమర శంఖారావం’లో ఆయన మాట్లాడుతూ, ఎల్లో మీడియా గురించి చెప్పనక్కర్లేదని, ఎల్లో మీడియా సాయంతో దొంగ సర్వేలు వేయిస్తారని, 59 లక్షల దొంగ ఓట్లను నమోదు చేయించారని ఆరోపించారు.
వచ్చే ఎన్నికలు న్యాయానికి- అన్యాయానికి; ఆప్యాయతకు- డబ్బుకు మధ్య జరిగేవిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన విరుచుకుపడ్డారు. రైతులకు ఆర్థిక సాయమంటూ డ్రామాలాడుతున్నారని, వారి జీవితాలతో ఆటలాడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు మూడు నెలల్లో ఉండటంతో చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొచ్చారని, పెన్షన్ ను రెండు వేల రూపాయలకు పెంచారని, ఇప్పుడు తన సినిమా-2లో డైలాగ్స్ కొడుతున్నారని, అధికారంలో ఉండగా చంద్రబాబుకు బీసీలు గుర్తుకురారని, ఇప్పుడు బీసీ డిక్లరేషన్ అంటూ డ్రామాలాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు లాంటి మనిషిని మనం ఏమనాలి? అన్నా’ అనాలా? ‘దున్నా’ అనాలా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.