Andhra Pradesh: టీడీపీకి పోటీగా.. ‘బీసీ గర్జన’ సభ నిర్వహణకు వైసీపీ నిర్ణయం!
- బీసీ నేతలతో జగన్ సమావేశం
- ఫిబ్రవరి మూడో వారంలో బీసీ గర్జన
- బీసీలు లక్ష్యంగా కీలక పథకాలు ప్రకటించే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ నిన్న రాజమండ్రిలో జయహో బీసీ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో బీసీలకు సీఎం చంద్రబాబు పలు వరాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ఈరోజు బీసీ నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి బొత్స సత్యనారాయణ, జోగి రమేశ్, పార్థసారథి, జంగా కృష్ణమూర్తి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పేర్ని నాని తదితర బీసీ నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యనేతలతో చర్చించిన జగన్.. వచ్చే నెల మూడోవారంలో ‘బీసీ గర్జన’ను నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే వైసీపీ నియమించిన బీసీ అధ్యయన కమిటీ గత 6 నెలలుగా రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా పలు నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. ఈ బీసీ గర్జన సదస్సులో చంద్రబాబు హామీలకు కౌంటర్ గా పలు ఆకర్షణీయమైన పథకాలను జగన్ ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.