: అరుణ గ్రహంపై ఆవాసం అంత 'వీజీ'కాదు


అరుణగ్రహంపై మానవుడి ఆవాసం గురించి ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. అంగారకుడిపై మనుషులు నివసించవచ్చని కూడా కొందరు చెబుతున్నారు. అయితే అంగారకుడిపై ఉండే దుమ్మూ, ధూళి వల్ల మానవులకు పలురకాలైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ గ్రహంపై ఉండే విషపూరితమైన ధూళి వల్ల మానవునికి పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వారు అంటున్నారు.

వాషింగ్టన్‌లో ఏర్పాటు చేసిన ‘హ్యుమన్‌ టు మార్స్‌ సమ్మిట్‌’ సదస్సులో ఆ గ్రహంలో ఉండే ధూళి వల్ల కలిగే ఇబ్బందుల గురించి పలువురు నిపుణులు హెచ్చరించారు. ఈ కారణంగానే భవిష్యత్తులో ఆ గ్రహంపై మానవులు నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా లేదని వారు తెలిపారు. అయితే ‘మార్స్‌ వన్‌’ అనే డచ్‌ కంపెనీ అరుణ గ్రహంపైకి మనుషులను చేరవేసేందుకు ఇప్పటికే టిక్కెట్ల అమ్మకాన్ని ప్రారంభించిన నేపధ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఇప్పటికే అరుణ గ్రహంపై యాత్రకు సుమారు 78 వేలమంది తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు తెలిసింది.

అంగారకుడిపై పెర్‌క్లోరేట్లు విస్తృత స్థాయిలో ఉన్నాయని, పెర్‌క్లోయిక్‌ ఆమ్లం నుండి ఉత్పత్తి అయ్యే ఈ ధూళి కణాలవల్ల మనుషులకు థైరాయిడ్‌ సమస్యలు తలెత్తే ప్రమాదముందని అమెరికా అంతరిక్షయాన సంస్థ నాసా ముఖ్య వైద్య అధికారి రిచర్డ్‌ విలియమ్స్‌ పేర్కొన్నారు. అరుణగ్రహంపై పరిశోధనకు పంపిన క్యూరియాసిటీ రోవర్‌ ఆ గ్రహంపై జిప్సమ్‌ ఆనవాళ్లను కూడా కనుగొంది. ఈ జిప్సమ్‌ వల్లకూడా ఇబ్బందులు పొంచి వున్నాయని పారాగాన్‌ స్పేస్‌ డెవలెప్‌మెంట్‌ సహ వ్యవస్థాపకుడు గ్రాండ్‌ ఆండర్సన్‌ తెలిపారు. జిప్సమ్‌ వల్ల బొగ్గు గనుల్లో సుదీర్ఘ కాలంపాటు పనిచేసేవారికి వచ్చే ‘బ్లాక్‌ లంగ్‌’ సమస్య వస్తుందని ఆండర్సన్‌ తెలిపారు. అంగారక గ్రహంపై ఉన్న ధూళిని స్పేస్‌ సూట్‌ నుండి తొలగించడం కూడా కష్టమని, అందువల్లే దానితో ఇబ్బందులు ఉంటాయని ఆయన అంటున్నారు. చంద్రుడిపై చేపట్టిన అపోలో యాత్రల ద్వారా చంద్రుడిపై ఉన్న ధూళితో తాము ఊహించిన దానికంటే ఎక్కువ సమస్యలున్నట్టు నాసా గుర్తించింది. ఈ యాత్ర ద్వారా అంతరిక్షంలో ఉన్న దుమ్మును తొలగించడం కష్టం అనే విషయాన్ని నాసా గుర్తించింది. ఈ దుమ్ము ద్వారా పలు సమస్యలు కూడా ఉన్నట్టు నాసా పేర్కొంటోంది.

  • Loading...

More Telugu News