: నాన్‌స్టిక్‌ పాత్రలతో జాగ్రత్త సుమీ!


మన ఇళ్లల్లో నాన్‌స్టిక్‌ పాత్రలు చాలా వరకూ వాడుతున్నాం. దోసె పెనం చాలా వరకూ అందరి ఇళ్లలోనూ ఉంటుంది. అయితే ఇలాంటి పాత్రలు వాడడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందట. ఇందులో పెర్‌ఫ్లూరోక్టానోయిక్‌ ఆసిడ్‌ (పీఎఫ్‌ఓఏ) అనే రసాయనం వుంటుంది. ఇది గుండెజబ్బులకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రసాయనం కేవలం నాన్‌స్టిక్‌ పాత్రల్లోనే కాకుండా మైక్రోవేవ్‌ లలో తయారు చేసుకునేందుకు వీలున్న పాప్‌ కార్న్‌ సంచులలోను, ఆహారంపై కప్పే కవర్లలోను ఇంకా రెయిన్‌ కోట్లలో కూడా ఉంటోందట.

భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త నేతృత్వం వహించిన ఒక పరిశోధనలో ఈ విషయం బయటపడింది. అయితే ఈ విషయాన్ని ఇంకా పూర్తిగా నిర్ధారించవలసివుంది. వెస్ట్‌ వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సుమారు 1200 మంది అమెరికా వాసుల ఆరోగ్యాన్ని గురించి విశ్లేషించి వారి పీఎఫ్‌ఓఏ సీరం స్థాయిలను గుండెజబ్బులతో పోల్చి చూశారు. ఇలాంటి వస్తువుల వాడకం వల్ల రక్తంలో పీఎఫ్‌ఓఏ స్థాయిలు అధికంగా ఉన్నవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం కూడా అధికంగా ఉన్నట్టు తేల్చారు. అయితే ఈ విషయంపై ఇంకా లోతుగా అధ్యయనం జరగాల్సి ఉందని ఈ పరిశోధనలో పాల్గొన్న డాక్టర్‌ అనూప్‌ శంకర్‌ అంటున్నారు. కేవలం పీఎఫ్‌ఓఏ వల్లే గుండెజబ్బులు వస్తున్నాయా? అనే విషయంపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని, ఏది ఏమైనా ప్రజలు ఇలాంటి రసాయనాలు ఆహారంలో కలవకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News