paswan: మహిళలు అంతరిక్షంలోకే వెళ్తున్నారు.. గుడిలోకి వెళ్లకూడదా?: పాశ్వాన్
- బీజేపీకి షాకిచ్చిన కేంద్ర మంత్రి పాశ్వాన్
- ఆలయంలోకి మహిళలు వెళ్తే తప్పేంటని ప్రశ్న
- శబరిమల వివాదంపై పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ శబరిమల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు కనకదుర్గ, బిందు ప్రవేశించడాన్ని నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించారు. ఈ ఘటనపై పాశ్వాన్ మాట్లాడుతూ.. మహిళలు ఎల్లలు లేకుండా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. అంతరిక్షంలోకి కూడా మహిళలు వెళ్తున్నారని, ఆలయంలోకి ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించి బీజేపీ ఝలక్కిచ్చారు.
మహిళల పేరుతో వివక్ష తగదని సూచించారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పిందని పాశ్వాన్ స్పష్టం చేశారు. కేరళ వివాదంపై మరో మంత్రి అనంతకుమార్ హెగ్డే మాట్లాడుతూ.. అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశానికి కేరళ సర్కారు మద్దతివ్వడాన్ని హిందుత్వంపై పట్టపగలు జరిగిన అత్యాచారమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతలోనే పాశ్వాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.