: తమ్మినేని పయనం ఎటువైపు?
శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత తమ్మినేని సీతారాం తన రాజకీయ భవిష్యత్తు విషయంలో డైలమాలో పడ్డారు. గత ఎన్నికల సందర్భంగా ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆముదాలవలస నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మళ్ళీ టీడీపీలో ప్రవేశించినా, మునుపటి ప్రాభవాన్ని కోల్పోయారు. తమ్మినేని పార్టీని వీడక ముందు సముచిత ప్రాధాన్యమిచ్చిన అధినేత చంద్రబాబు.. ఆయన మళ్ళీ పాతగూటికే తిరిగొచ్చినా, పెద్దగా పట్టించుకోవడంలేదు.
ఈ నేపథ్యంలో తమ్మినేని భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. ఈ క్రమంలో ఆయన వైఎస్సార్సీపీ నేతలతోనూ మంతనాలు జరిపారు. అయితే, కార్యకర్తలు మాత్రం తమ్మినేని మళ్ళీ తప్పుచేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. తానేమీ ఇప్పుడు పార్టీ మారడంలేదని చెబుతున్నా, రాజకీయ వర్గాల్లో మాత్రం తమ్మినేని చూపు జగన్ పార్టీవైపే అని ప్రచారంలో ఉంది.