Telangana: తెలంగాణలో గత నాలుగేళ్లలో కేటీఆర్ ఆస్తులు 400 రెట్లు పెరిగాయి!: రాహుల్ గాంధీ

  • నిధులు, నీళ్లు, నియామకాలను ప్రజలు ఆశించారు
  • కానీ ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదు
  • గద్వాల సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ

ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలోని ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలను ఆశించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అన్ని అంశాల్లో తెలంగాణ ప్రజలను మోసగించారని ఆరోపించారు. బంగారు తెలంగాణ కోసం రాష్ట్ర ప్రజలు కలగంటే, ఆయన కుటుంబానికి మాత్రమే టీఆర్ఎస్ అధినేత పదవులు ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.10 వేల కోట్ల నుంచి రూ.60,000 కోట్లకు తీసుకెళ్లారని తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో ఆయన వేలకోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. గద్వాలలో ఈ రోజు నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ కు కొత్త పేరు వచ్చిందనీ.. అది ఖావో కమీషన్ రావు(కమీషన్లు తినే రావు) అని రాహుల్ చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణకు కేవలం రూ.70,000 కోట్ల అప్పు మాత్రమే ఉండేదనీ, ఇప్పుడు మొత్తం అప్పు రూ.2.5 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. ఇప్పుడు తెలంగాణలోని ప్రతి కుటుంబంపై రూ.1.5 లక్షల అప్పు ఉందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ ఆదాయం మాత్రం 400 శాతం పెరిగిందని ఆరోపించారు. ఈ రోజు తెలంగాణలో 30 లక్షల మంది యువతకు ఉపాధి లేదన్నారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో తెలంగాణలో ఎంతమంది యువతీయువకులకు కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News