Jagan: జగన్‌ను సీఎం చేయడమే నా లక్ష్యం.. పార్టీ మారుతున్నానన్న వార్తలు అవాస్తవం: వైసీపీ నేత గౌరు వెంకటరెడ్డి
- టీడీపీలో చేరుతున్నట్టు కొందరు జగన్‌కు ఫిర్యాదు చేశారు
- తుది శ్వాస వరకు వైసీపీలోనే
- కార్యకర్తల సమావేశంలో గౌరు
తాను వైసీపీని వీడి టీడీపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వైసీపీ నేత గౌరు వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని చెప్పుకొచ్చారు. అధినేత జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని, తుది శ్వాస వరకు జగన్‌తోనే ఉంటానని తేల్చి చెప్పారు. త్వరలోనే తాను టీడీపీలో చేరబోతున్నట్టు కొందరు జగన్‌కు కావాలనే ఫిర్యాదు చేశారని ఆరోపించారు. నియోజకవర్గానికి తానెప్పుడూ దూరంగా లేనని పేర్కొన్న వెంకటరెడ్డి.. ఇక్కడ ఫ్యాక్షనిజాన్ని రూపుమాపిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ఇటీవల తాను నియోజకవర్గానికి దూరంగా ఎందుకు ఉంటున్నది అధినేత జగన్‌కు, ఎమ్మెల్యే ఐజయ్యకు, తనకు మాత్రమే తెలుసని వెంకటరెడ్డి అన్నారు.