Chandrababu: తెలంగాణలో కాంగ్రెస్ కేవలం భాగస్వామే.. మిత్రపక్షం కాదు!: స్పష్టం చేసిన చంద్రబాబు
- ఏపీలో ఒంటరి పోరే
- కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపిందన్న భావన రాకుండా చూసుకోండి
- మహాకూటమిలో కాంగ్రెస్ ఓ పార్టీ అంతే
తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుపై వస్తున్న విమర్శలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెరదించారు. తెలంగాణలో మహాకూటమిలో భాగంగానే కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్నామని, ఏపీలో మాత్రం కాంగ్రెస్ తమకు ప్రత్యర్థేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒంటరిగానే బరిలోకి దిగుతామన్నారు. శనివారం సీఎం అధ్యక్షతన ఉండవల్లిలో నిర్వహించిన టీడీపీపీ సమావేశంలో చంద్రబాబు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.
కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపిందన్న భావన ప్రజల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని, అటువంటి భావన ప్రజల్లో వస్తే కష్టమని నేతలకు సూచించారు. మహాకూటమిలో కాంగ్రెస్ ఓ భాగస్వామ్య పార్టీ తప్పితే, దానితో టీడీపీ నేరుగా చేతులు కలపలేదన్నారు. ఈ విషయంలో ఎంపీలు చాలా స్పష్టంగా ఉండాలన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు సవివరంగా చెప్పాలని చంద్రబాబు సూచించారు.