Andhra Pradesh: షార్జాలో తెలుగు కూలీల కష్టాలు.. సాయం కోసం ఎదురు చూపులు!

  • టూరిస్ట్‌ వీసాపై రావడంతో వెళ్లిపోవాలని యూఏఈ ప్రభుత్వం ఆదేశం
  • పనిలేక, తిండిలేక ఎలా వెళ్లాలో అర్థం కాక అవస్థలు
  • షార్జాలోని ఓ పార్క్‌లో ప్రస్తుతం కాలం వెళ్లదీస్తున్న కూలీలు

పొట్టచేత పట్టుకుని ఆ దేశానికి వలసపోయారు. కష్టపడి నాలుగు రూకలు వెనకేసుకోవాలని ఆశపడ్డారు.  వారి ఆశ అడియాశ అయ్యింది. ఆకలి జీవితమే మిగిలింది. టూరిస్ట్‌ వీసాపై వచ్చి గడువు తీరినా వెళ్లక పోవడంతో జైలుకు పంపాల్సి ఉన్నా,  అక్కడి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి విడుదల చేసింది. కానీ చేతిలో చిల్లిగవ్వలేక ఇంటికి వచ్చేందుకు ఏ ‘దారీ’ కానరాక వీరు అవస్థలు ఎదుర్కొంటున్నారు. షార్జాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 33 మంది భవన నిర్మాణ కార్మికుల గోడు ఇది.

వివరాల్లోకి వెళితే... తెలంగాణలోని నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, వరంగల్‌, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన 33 మంది కార్మికులు దుబాయ్‌ వెళ్లారు. దళారీలు వీరికి ఉపాధి వీసా అని మాయమాటలు చెప్పి సందర్శక వీసాపై పంపారు. విషయం గుర్తించిన యూఏఈ ప్రభుత్వం తక్షణం వెళ్లిపోవాలని ఆదేశించింది. వీరికీ స్వదేశానికి వచ్చేయాలని ఉన్నా పనిలేక పోవడంతో ఇమ్మిగ్రేషన్‌ రుసుము, విమాన టికెట్టుకు కూడా డబ్బుల్లేవు.

దీంతో షార్జాలోని ఓ పార్క్‌లో దీనావస్థలో కాలం వెళ్లదీస్తున్న వీరి పరిస్థితి చూసి కేరళకు చెందిన ప్రవాస భారతీయులు ఆహారం అందించి ఆకలి తీస్తున్నారు. విషయం తెలుసుకున్న దుబాయ్‌లోని ఏపీ ఎన్నార్టీ ప్రతినిధులు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 11 మందికి విమాన టికెట్లు ఇచ్చేందుకు ముందుకువచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించి తమను స్వదేశానికి చేరే ఏర్పాట్లు చేయాలని ఆ రాష్ట్ర యువకులు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News