Andhra Pradesh: ఏపీలో ‘కాంగ్రెస్’తో పొత్తు ఉండదు: కేఈ కృష్ణమూర్తి
- ‘కాంగ్రెస్’కు వ్యతిరేకంగా నాడు టీడీపీని స్థాపించారు
- టీడీపీ జాతీయ పార్టీ: డిప్యూటీ సీఎం
- వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేఈ
కాంగ్రెస్ పార్టీతో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ జాతీయ పార్టీ అని, ఇతర రాష్ట్రాల్లో పొత్తులు ఏ విధంగా ఉన్నా..ఏపీలో మాత్రం ‘కాంగ్రెస్’తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
కాగా, కాంగ్రెస్ తో పొత్తు ఉండదని కేఈ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ఇటీవల మండిపడ్డారు. ఈ విషయమై కేఈ స్పందిస్తూ, వర్ల ఎవరు తనకు చెప్పడానికి? అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించారన్నది తమ మనసులలో నాటుకుపోయిందని, కింది స్థాయి కేడర్ నుంచి వచ్చిన అభిప్రాయాలనే తాను వెల్లడించానని అన్నారు. కాంగ్రెస్ తో పొత్తు ఉండదని తాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం చంద్రబాబు తనను మందలించారని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని అన్నారు.