Telangana: హైదరాబాదు శివారు ప్రగతి నగర్ లో బీటెక్ విద్యార్థి అదృశ్యం
- నేను బతకను అని నోట్ బుక్‌లోరాసి మరీ మాయం
- చదువు మధ్యలో ఆపేసి ఇంట్లోనే ఉంటున్న సందీప్
- పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి
ఓ బీటెక్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఈ యువకుడు తిరిగి ఇంటికి చేరలేదు. హైదరాబాదు శివారు బాచుపల్లి పోలీసుల కథనం మేరకు...బాచుపల్లి మండలం ప్రగతి నగర్ నివాసి అయిన హరిప్రసాద్ చిన్న కొడుకు సందీప్ (22) బీటెక్ మధ్యలోనే ఆపేశాడు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. ఈనెల 6వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
గతంలో కూడా బయటకు వెళ్లి రెండు మూడు రోజుల తర్వాత ఇంటికి రావడం సందీప్‌కు అలవాటు. కుటుంబ సభ్యులు ఈసారి కూడా అలాగే అనుకున్నారు. అయితే ఇప్పటివరకు రాలేదు. కాగా, మంగళవారం కొడుకు గదిలో వెతకడంతో ఓ నోట్ బుక్ కనిపించింది. అందులో ‘అందరూ నన్ను క్షమించండి...నేను బతకను’ అని రాసివుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.