Kerala: సైన్యంతో పరాచికాలు... సాయం చేసేందుకు వస్తే... హెలికాప్టర్ ముందు సెల్ఫీ దిగి.. బై చెప్పాడు!
- వరదలు ముంచెత్తి సాయం కోసం చూస్తున్న కేరళ వాసులు
- ఎరుపు చొక్కాను చూపించి హెలికాప్టర్ ను దించిన యువకుడు
- ఆపై సెల్ఫీ దిగడంతో విస్తుపోయిన రెస్క్యూ సిబ్బంది
ఓ వైపు వరదలు ముంచెత్తి, ప్రాణాలు కాపాడుకునేందుకు లక్షలాది మంది సాయం కోసం చూస్తున్న వేళ, పైన వెళుతున్న హెలికాప్టర్ కు తన ఎర్ర చొక్కా చూపించి, వారిని తప్పుదారి పట్టించి, తనలోని సెల్ఫీ పిచ్చి ఎంతటి పరాకాష్టకు చేరిందో చూపించి, నెటిజన్ల నుంచి తిట్లు తింటున్నాడో కేరళ యువకుడు. సహాయక చర్యల్లో భాగంగా, సైన్యంతో పాటు నౌకాదళం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎంతో శ్రమిస్తున్న వేళ, ఆ యువకుడి చేష్టలపై మండిపడుతున్నారు.
వర్షం తగ్గి, వరద నెమ్మదించిన వేళ, ఇప్పటికీ చిక్కుకునే ఉన్న బాధితుల కోసం కొంతమంది రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ లో గాలిస్తున్న వేళ ఈ ఘటన జరిగింది. కింద ఉన్న ఓ యువకుడు, తాను ధరించిన ఎరుపు రంగు చొక్కాను విప్పి గాల్లోకి ఊపుతూ హెలికాప్టర్ కు చూపించాడు. అతను ఆపదలో ఉన్నాడని భావించి, చాపర్ ను కిందకు దించగా, చక్కగా దాని ముందుకు వచ్చి, ఓ సెల్ఫీ దిగి, ఆపై వారిని వెళ్లిపోవాలని చెప్పడంతో హెలికాప్టర్ లోని సిబ్బంది విస్తుపోయారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో వెల్లడించడంతో సదరు యువకుడి వైఖరి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ కామెంట్లు వస్తున్నాయి.