Andhra Pradesh: ఏపీ బంద్ విజయవంతంగా జరిగింది: వైఎస్ జగన్
- ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారు
- ఏపీకి ప్రత్యేకహోదా ప్రజల ఆకాంక్ష
- వైసీపీ కార్యకర్త దుర్గారావు మృతికి చంద్రబాబే కారణం
ఏపీకి అన్యాయం చేస్తున్న ఎన్డీఏ సర్కారు తీరును నిరసిస్తూ వైసీపీ పిలుపు మేరకు ఈరోజు బంద్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ, ఏపీ బంద్ విజయవంతంగా జరిగిందని, ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ప్రజల ఆకాంక్ష అని, ఆ ఆకాంక్షకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కార్ ఈ బంద్ ను అణచివేయాలని చూసిందని విమర్శించారు.
కాగా, బుట్టాయిగూడెంలో జరిగిన బంద్ లో పాల్గొన్న వైసీపీ కార్యకర్త కాకి దుర్గారావు మృతి చెందాడు. వైసీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజుతో కలిసి ఈ బంద్ లో దుర్గారావు పాల్గొన్నాడు. పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి దుర్గారావును తరలిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సంఘటన నేపథ్యంలో జగన్ స్పందిస్తూ.. దుర్గారావు గుండెపోటుతో చనిపోయాడని, అతని మృతికి సీఎం చంద్రబాబే కారణమని ఆరోపించారు.