: సనావుల్లాపై దాడి చేసింది స్నేహితుడే!


కొద్ది రోజుల క్రితం జమ్మూ జైల్లో పాకిస్తానీ ఖైదీ సనావుల్లా రంజాయ్ పై దాడి చేసింది భారత మాజీ సైనికుడు వినోద్ కుమార్ అని తెలిసిందే. అయితే, సనావుల్లా, వినోద్ కుమార్ ఇద్దరూ మంచి స్నేహితులట. జైల్లో పనుల సందర్భంగా వీరిద్దరూ ఎప్నుడూ కలిసే ఉండేవారని, వంట కార్యక్రమాల్లోనూ, తోటపని చేసే సమయంలోనూ జంటగా కనిపించేవారని జైలు అధికారులు అంటున్నారు. కాగా, దాడికి ముందు కూడా వీరిద్దరూ ఒకే బీడీని పంచుకున్నారట. ఈ విషయమై జైలు అధికారి ఒకరు మాట్లాడుతూ, ఆనాటి సంఘటనను వివరించారు.

జైలులో మట్టిపని చేస్తుండగా, సనావుల్లా తన చేతులు మురికిగా ఉన్నాయని, జేబులోంచి ఓ బీడీ తీసిమ్మని వినోద్ కుమార్ ను కోరాడట. దీంతో, వినోద్ కుమార్ బీడీ తీసివ్వగా, దాన్ని ఇద్దరూ ఆస్వాదించారు. అనంతరం, వినోద్ కుమార్ పారతో పని చేస్తుండగా.. సరబ్ జిత్ వ్యవహారం చర్చకురావడం.. వీరిద్దరి మధ్యా మాటామాటా పెరగడం జరిగాయి. వినోద్ కుమార్ ఒక్కసారిగా సనావుల్లాపై పారతో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడని జైలు అధికారి తెలిపారు.

ఉత్తరాఖండ్ కు చెందిన వినోద్ కుమార్ మాజీ సైనికుడు. గర్వాల్ రెజిమెంట్ లో సైనికుడిగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో తోటి సైనికుడిని కాల్సి చంపిన కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం అతనిపై సనావుల్లా హత్యానేరం కూడా మోపారు.

  • Loading...

More Telugu News