Jagan: చంద్రబాబు, జగన్‌ లపై పవన్‌ కల్యాణ్‌ విమర్శలు!

  • హోదా కోసం పోరాడుతున్నది ఒక్క జనసేన పార్టీ మాత్రమే 
  • ప్రశ్నిస్తున్నది నేనొక్కడినే
  • జగన్ ఏమీ మాట్లాడరు... ఆయనకు ప్రధాని అంటే భయం
  • విశాఖ రైల్వే జోన్ కూడా సాధించలేకపోయారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై 2016 నుంచి ఒకే మాటపై ఉండి, హోదా సాధించాల్సిందే అని పోరాడుతున్నది ఒక్క జనసేన పార్టీ మాత్రమేనని, ప్రశ్నిస్తున్నది తానేనని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈరోజు విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ... "ముఖ్యమంత్రి కాకినాడ మీటింగులో నన్ను తిట్టారు. జనసేనకు స్పష్టత లేదు అన్నారు. హోదాపై స్పష్టంగా ఉన్నది జనసేన మాత్రమే. నేను హోదాపై పోరాడాలి అన్నప్పుడే సీఎం నాకు మద్దతుగా ఉంటే బాగుండేది. అయన మాత్రం రోజుకో మాట చెప్పారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఎలా మాటలు మార్చారో వీడియోలు విడుదల చేస్తాను.

ఇక జగన్ ఈ విషయంపై ఏమీ మాట్లాడరు... ఆయనకు ప్రధాని అంటే భయం. విశాఖ రైల్వే జోన్ కూడా సాధించలేకపోయారు. జోన్ లేదు, గీను లేదు అని వెటకారం ఆడతారు. కనీసం రైల్వే బ్రిడ్జి కూడా సాధించలేకపోతున్నారు. కొత్తవలస దగ్గర రైల్వే బ్రిడ్జి కావాలని ఓ యువకుడు ఆమరణ దీక్ష చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ ఎంపీ హరిబాబు పట్టించుకోవడం లేదు. రైల్వే బ్రిడ్జ్ అనేది ఒక ఎంపీ సాధించగలిగేదే. ఎంపీగా హరిబాబు కనీసం పట్టించుకోలేదు. ఆ యువకుడు దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన పోరాటానికి జనసేన అండగా ఉంటుంది.

ఎస్.కోట పరిధిలో 44 గిరిజన గ్రామాలు ఉన్నాయి. వాటిని ఐ.టి.డి.ఎ పరిధిలోకి తీసుకురాకపోవడంతో అభివృద్ధి లేదు. అక్కడ కనీస వసతులు లేవు. తగిన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం లేదు. జిందాల్ పరిశ్రమ కోసం భూములు సేకరించారు. ఇప్పటికీ పరిశ్రమ రాలేదు. రైతులకి న్యాయం చేయలేదు. యువతకి ఉపాధి లేదు. జనసేన అధికారంలోకి వచ్చిన తరవాత జిందాల్ రైతులకి న్యాయం చేస్తాం.

పతంజలి ఫుడ్ పార్క్ కోసం 200 ఎకరాలు తీసుకున్నారు. ఫుడ్ పార్క్ ఎక్కడ? పరిశ్రమల పేరుతో భూములు లాక్కొంటారు. కానీ పరిశ్రమలు రావు. ఉద్యోగాలు కల్పించరు. తాడిపూడి నుంచి వెళ్లే నీళ్ళని పరిశ్రమలకి ఇస్తున్నారు తప్ప రైతులకి మాత్రం సాగు నీరు ఇవ్వడం లేదు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గానికి రూ.25 కోట్లు ఖర్చు చేసి ఓట్లు కొనాలని టీడీపీ అనుకొంటోంది. నేను శ్రీకాకుళంలో నిరుద్యోగ యువత బాధలు చెప్పగానే నిరుద్యోగ భృతి అన్నారు. ఇలాంటి కంటి తుడుపు చర్యలను నమ్మవద్దు. మనకి కావలసింది ఉద్యోగాలు, ఉపాధి.

రాజకీయాల్లోకి వస్తే అవమానిస్తారనీ, తిడతారని తెలుసు. నేను ఇంట్లో కూర్చొంటే ఏమీ అనరు. అన్యాయం చేస్తుంటే, వివక్ష చూపుతుంటే మాట్లాడకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను. అందుకే వచ్చాను. అందుకే ప్రజా పోరాట యాత్ర చేస్తున్నాను. జనసేన అధికారంలోకి వస్తే.. లంచాలు ఉండవు. నాకు డబ్బుపై వ్యామోహం లేదు. ప్రజా సమస్యలు తీరుస్తాను. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పారదోలేవరకూ జనసేన పోరాడుతుంది. నా బిడ్డలు ఎలా ఉండాలి అనుకొంటానో... అందరూ అలా బాగుండాలి
అనుకొనేవాణ్ణి నేను"  అన్నారు.

  • Loading...

More Telugu News