Chandrababu: వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా!: చంద్రబాబు

  • కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదు
  • దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి టీడీపీ కృషి
  • రైతుల పోరాటాన్ని అవహేళన చేస్తున్నారు
  • టీడీపీ రైతులకు న్యాయం చేస్తుంది

వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రాదని, ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి టీడీపీ కృషి చేస్తుందని చెప్పారు. ఈరోజు కర్నూలు జిల్లా జొన్నగిరిలో జరిగిన నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "అధికారంలోకి వస్తే స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని, రైతులకు న్యాయం చేస్తామని గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. గిట్టుబాటు ధర ఇస్తామని అన్నారు.

కానీ, ఇప్పుడు రైతులు వాటిని అమలు చేయమంటే వారిని అవహేళన చేస్తున్నారు. రైతులకు న్యాయం జరిగేవరకు టీడీపీ వారికి అండగా ఉంటుంది. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి నిధులు రావట్లేదు. ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ప్రత్యేక హోదాతో పాటు అన్ని అంశాలను సాధించేవరకు టీడీపీ వదిలిపెట్టదు. టీడీపీ నేతలు ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. కేంద్ర సర్కారుపై పోరాడకుండా మాపై ఆరోపణలు చేస్తున్నారు.

రాష్ట్ర రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాగే, ఎవరు అడ్డం వచ్చినా పోలవరం ప్రాజెక్టు ఆగదు.. పోలవరం కావాలా? వద్దా? అని అడుగుతున్నాను. పోలవరం పూర్తి కాకపోతే చాలా నష్టం జరుగుతుంది. అది పూర్తి కావాలంటే కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. 2019 డిసెంబరు లోపల పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. అందుకు నిధులు రావాలి. ఇప్పటికే 55 శాతం పనులు పూర్తయ్యాయి" అని అన్నారు.

  • Loading...

More Telugu News