Chandrababu: అలాంటి భయంకరమైన 'గాలి' అది!: బీజేపీ కుయుక్తులపై చంద్రబాబు
- కర్ణాటకలో సాధించింది ప్రజాస్వామ్య విజయం
- గాలి జనార్దన్ రెడ్డి పేరు మీరు వినే ఉంటారు
- అప్పట్లో ఖనిజ సంపదను అంతా దోచేశారు
- అలాంటి 'గాలి'ని మళ్లీ తీసుకొచ్చి ముందు పెట్టుకున్నారు
'కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు.. ఇది ప్రజాస్వామ్య విజయం. మీరందరూ ఆనందంగా ఉన్నారా? ఉన్నామనే వారందరూ చేతులు పైకెత్తండి. ఒక్క మనకే కాదు.. దేశంలో ఉండే ప్రతిఒక్కరు ఆనందపడుతున్నారు. ఇది మామూలు విజయం కాదు. ప్రజాస్వామ్య విజయం. అప్పట్లో అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూడా బర్తరఫ్ చేశారు. మళ్లీ 30 రోజుల్లో ఆయన సీఎంగా నిలిచారు' అని చంద్రబాబు అన్నారు.
ఈ రోజు విజయవాడలో 'సాధికార మిత్రలతో ముఖాముఖి' కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ఒక పద్ధతి లేకుండా బీజేపీ రాజకీయాలు చేసిందని అన్నారు. ఎమ్మెల్యేలను డబ్బిచ్చి కొనుక్కోవాలని చూసిందని అన్నారు. 'గాలి జనార్దన్ రెడ్డి పేరు మీరు వినే ఉంటారు. ఆ 'గాలి'ని చూస్తేనే మనకు భయం వేస్తోంది. అలాంటి భయంకరమైన గాలి అది. అప్పట్లో ఖనిజ సంపదను అంతా దోచేసిన వ్యక్తి, అలాంటి గాలిని మళ్లీ తీసుకొచ్చి ముందు పెట్టుకుని రాజకీయం చేశారు' అన్నారు.
తాము ఇచ్చిన పిలుపు మేరకు కర్ణాటకలో తెలుగువారు స్పందించారని, బీజేపీకి ఓటు వేయలేదని చంద్రబాబు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతిని అంతమొందిస్తానని అన్నారని, ఇప్పుడేమో ఇలా అవినీతి పరులకి మద్దతు తెలుపుతూ ముందుకు వెళుతున్నారని చంద్రబాబు విమర్శించారు.