Andhra Pradesh: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా.. ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ గా సోము వీర్రాజు నియామకం!
- ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియామకం అంశానికి నేటితో తెర
- ఇద్దరి నియామకాలను అధికారికంగా ప్రకటించిన అధిష్ఠానం
- కన్నా వర్గీయుల సంతోషం
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనే అంశానికి నేటితో తెరపడింది. సోము వీర్రాజు, మాణిక్యాలరావు, పురందేశ్వరి, మరికొందరు నేతల పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినపడ్డాయి. అయితే, ఎవరూ ఊహించని విధంగా, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించారు. మరోపక్క, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ గా సోము వీర్రాజును నియమించారు. ఇద్దరి నియామకాలను బీజేపీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. కన్నా నియమాకంపై ఆయన అనుచరులు, వర్గీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, చాలా ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఏడాది క్రితం బీజేపీలో చేరారు. అయితే, వైసీపీలో చేరేందుకు కన్నా ఇటీవల సిద్ధపడ్డారు. అనారోగ్యకారణాల వల్ల వైసీపీలో చేరే విషయాన్ని ఆయన వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆయన్ని బుజ్జగించారని, పార్టీలో ప్రాధాన్యమున్న పదవిని ఇస్తామనే హామీ నేపథ్యంలోనే వైసీపీలో చేరడాన్ని కన్నా వాయిదా వేసుకున్నట్టు ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజమే అన్నట్టుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నాను నియమించడం గమనార్హం.