: కొడితే రక్తం రావాలి కదా, రాలేదే: వివాదంపై రామ్ చరణ్


ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ పై దాడి వివాదంపై మెగా తనయుడు రామ్ చరణ్ నేడు వివరణ ఇచ్చాడు. వారిని తాను గానీ, తన భద్రత సిబ్బంది గానీ కొట్టలేదని, కేవలం అక్కడ తోపులాట చోటు చేసుకుందని రామ్ చరణ్ చెప్పాడు. తాము వారిపై ముష్టి ఘాతాలు కురిపించి ఉంటే రక్తం వచ్చేదని, అలా రాలేదే అని రామ్ చరణ్ వ్యాఖ్యానించాడు. ఆ గొడవ జరిగిన సమయంలో తన పక్కన భార్య ఉపాసన కూడా ఉందని రామ్ చరణ్ వెల్లడించాడు.

తాము కార్లో వెళుతుండగా, ఆ ఇద్దరు ఐటీ ఉద్యోగులు కారును తమ కారుకు అడ్డంగా ఆపి నడుచుకుంటూ వచ్చి కారు అద్దాలపై తట్టడంతోపాటు దురుసుగా ప్రవర్తించారని రామ్ చరణ్ వివరించారు. భార్య పక్కన ఉండడంతో తాను హుందాగా ప్రవర్తించానని, అందుకే తన వ్యక్తిగత భద్రత సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించానని తెలిపాడు.

వారు వచ్చి ఆ ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ ను పక్కకు లాగేశారని చెప్పాడు. ఆ తర్వాత వారిద్దరూ తనకు క్షమాపణ్ చెప్పినట్టు రామ్ చరణ్ అంటున్నాడు. కాగా, ఆ వివాదంలో తాను ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నట్టు ఓ ఫొటో మీడియాలో ప్రచురితం అయిందని, అది నకిలీదని రామ్ చరణ్ ఆరోపించాడు.

తన భద్రత సిబ్బంది వారిద్దరినీ పక్కకు లాగివేస్తున్న సమయంలో తాను వారిపక్కనే నిలుచుని ఉన్నట్టు ఫొటోలో ఉండడం అవాస్తమని తెలిపాడు. మార్ఫింగ్ కు పాల్పడ్డారని రామ్ చరణ్ వివరించాడు. ఏదేమైనా, ఆ ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని వారిపై ఫిర్యాదు చేయలేదని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News