Chandrababu: ఆడపిల్లల జోలికొస్తే ఖబడ్దార్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హెచ్చరిక
- దారుణాలకు పాల్పడిన వారు భూమి మీద ఉండడానికి వీల్లేదు
- మనందరి ఆలోచనా విధానంలో మార్పు రావాలి
- ఇంటర్నెట్తో చిన్నపిల్లలు తప్పుడు దారుల్లో వెళుతున్నారు
- దాచేపల్లి లాంటి ఘటన అదే చివరిది కావాలి
'ఆడపిల్లల జోలికొస్తే ఖబడ్దార్' అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవల గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై అఘాయిత్యం జరిగినప్పుడు నిందితుడిని పట్టుకోవడానికి 17 పోలీసు బృందాలు ఏర్పాటు చేశామని, డ్రోన్లతోనూ గాలించామని అన్నారు. ఇలాంటి ఘటనల్లో నిందితుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని చెప్పారు. ఇటువంటి దారుణాలకు పాల్పడిన వారు భూమి మీద ఉండడానికి వీలులేదని అన్నారు.
‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ అనే నినాదంతో విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు సాగిన ప్రదర్శనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని, అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో టెక్నాలజీ బాగా అందుబాటులో ఉందని, మంచిగా వాడుకుంటే ఎంతగానో ఉపయోగపడుతుందని చంద్రబాబు అన్నారు.
అలాగే ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో చిన్నపిల్లలు తప్పుడు దారుల్లో వెళుతున్నారని, మనందరి ఆలోచనా విధానంలో మార్పు రావాలని అన్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుతోన్న దారుణాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందని అన్నారు. దాచేపల్లి లాంటి ఘటన అదే చివరిది కావాలని, మరోసారి ఇటువంటి ఘటన జరిగితే నిందితులకు అదే చివరి దినం కావాలని వ్యాఖ్యానించారు.