Chandrababu: జగన్ కంటే మించిన నాయకుడు లేడని ఓ కేంద్ర మంత్రి అన్నారు!: రాందాస్ వ్యాఖ్యలను ఎద్దేవా చేసిన చంద్రబాబు
- ఎన్డీఏ.. గౌరవం, పద్ధతి లేని రాజకీయాలు చేస్తోంది
- అవినీతి పరులతో పొత్తు పెట్టుకోవాలనుకుంటోంది
- ఎన్డీఏని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి
- అవినీతిపరులు పారిపోయినా పట్టుకోలేని పరిస్థితి
ఓ పార్టీ అధినేత తెలుగువారికి అపకీర్తి తీసుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మరోవైపు జగన్ కంటే మించిన నాయకుడు లేడని ఓ కేంద్ర మంత్రి అన్నారని, ఎన్డీఏ.. గౌరవం, పద్ధతి లేని రాజకీయాలు చేస్తూ పొత్తులు పెట్టుకుంటుందని విమర్శించారు. అవినీతిపరులతో పొత్తు పెట్టుకున్న తరువాత ఎన్డీఏని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ కూడా బలమైన పార్టీ అని, ఆ పార్టీ ఎన్డీఏలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు అలా వ్యాఖ్యానించారు.
మరోవైపు అవినీతి పరులు విదేశాలకు పారిపోయినా కూడా పట్టుకోలేని పరిస్థితి ఎన్డీఏ పాలనలో ఉందని ముఖ్యమంత్రి విమర్శించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు అమరావతిలోని ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ ఏది చేసినా ఓ పద్ధతి ప్రకారం చేసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, వాటి వల్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పుకొచ్చారు.
తాము గతంలో 9 ఏళ్లు చేసిన అభివృద్ధి వల్ల ఈ రోజు హైదరాబాద్ వల్ల చాలా ఆదాయం వస్తుందని అన్నారు. 2050 కల్లా ప్రపంచంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యం పెట్టుకున్నామని, ఆ విధంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ఇంకా బాగా ముందుకు వెళ్లే వాళ్లమని వ్యాఖ్యానించారు.