Chandrababu: కేంద్ర ప్రభుత్వం మున్ముందు ఏ రూట్లో వస్తుందో చూడాలి: చంద్రబాబు
- మోదీకి స్పష్టంగా చెబుతున్నా
- తెలుగు జాతి రగిలిపోయే పరిస్థితి వచ్చింది
- మీది దుర్మార్గమైన చర్య
- మన నేతలు ఏపీలో రాస్తారోకోలు చేస్తే ఏమొస్తుంది?
అప్పట్లో స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామ రాజు వంటి వారు తమ తమ శైలిలో పోరాడారని, కొంత మంది మనవాళ్లు మాత్రం బ్రిటీష్ వారితో లాలూచీ పడ్డారని, వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజు తాను చేసే పోరాటం రాష్ట్రం కోసమేనని, తాను కేంద్ర ప్రభుత్వం, మోదీపై పోరాటం చేస్తున్నానని అన్నారు. వైసీపీ ఈ పోరాటానికి కలిసి రాకుండా కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ రాజకీయాలు చేస్తోందని అన్నారు. పోరాటంలో చిత్తశుద్ధి ఉండాలని, కేంద్ర ప్రభుత్వం మున్ముందు ఏ రూట్లో వస్తుందో మనం ఏ రూట్లో పోవాలో చూడాలని వ్యాఖ్యానించారు.
అసలు బ్రిటీష్ వారికి, కేంద్ర ప్రభుత్వానికి తేడా ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో ఎవరైనా అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు నష్టపోతారని అన్నారు. అలాగే ప్రధాని మోదీ చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పాలని అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలుగు జాతి మొత్తం రగిలిపోయే పరిస్థితి వచ్చిందని ప్రధాని మోదీకి స్పష్టంగా చెబుతున్నానని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వానిది దుర్మార్గమైన చర్య అని, ఏపీకి నిధులు పంపామని చెబుతున్నారని, ఇతర రాష్ట్రాలకు ఎంతిచ్చారు? మాకెంతిచ్చారు? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర నేతలు ఢిల్లీకి వెళ్లి పోరాటం చేయాలి కానీ, రాష్ట్రంలో రాస్తారోకోలు చేస్తే ఏమొస్తుందని అన్నారు.