Andhra Pradesh: వినియోగదారులు బలోపేతం కావాలి: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
- నిత్యావసర వస్తువుల, జనరిక్ మందుల అధిక ధరలను నియంత్రిస్తాం
- బంగారం నాణ్యత పరీక్షకు 5 ల్యాబ్స్ ఏర్పాటు చేస్తాం
- రేషన్ తీసుకోకపోయినా కార్డు రద్దు కాదు
- గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో మరణిస్తే రూ.6 లక్షల పరిహారం
వినియోగదారులు బలోపేతం కావాలని, వస్తువుల నాణ్యత, ధరలు, తూనికలు, కొలతల విషయంలో తగినంత జాగ్రత్తగా ఉండాలని ఏపీ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ చైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సచివాలయం 5వ బ్లాక్ సమావేశ మందిరంలో ఈ రోజు రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను, జనరిక్ మందుల అధిక ధరలను నియంత్రిస్తామని చెప్పారు. రేషన్ బియ్యం మిల్లులకు తరలకుండా, రేషన్ డిపోల్లో మోసాలు జరగకుండా రేషన్ షాపు డీలర్ల అసోసియేషన్ వారు నియంత్రించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బియ్యం అక్రమ రవాణా జరుగకుండా, పంటలో మార్పు తీసుకువచ్చి ప్రజలు తినే బియ్యాన్నే పంపిణీ చేసే ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రజలు తినే బియ్యాన్నే పండిస్తున్నారని, అందువల్ల ఆ రెండు జిల్లాల్లో పంపిణీ చేసిన బియ్యం అక్రమ రవాణా కావడంలేదని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో కూడా రైతులతో మాట్లాడి ఆ విధానం అనుసరిస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన సందర్భంలో 48 గంటల్లో రైతుల ఖాతాలకు నగదు జమ అవుతున్నట్లు తెలిపారు.
కొత్త రేషన్ కార్డులు, బదిలీలు, పేర్లు, చిరునామా, ఇతర వివరాల మార్పుల నిమిత్తం చేసుకున్న దరఖాస్తులు 38 వేలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని 15 రోజుల్లో అందజేస్తామని చెప్పారు. చంద్రన్న విలేజ్ మాల్స్ లో మూడు రకాల సరుకులు, మూడు రకాల ధరలు కాకుండా సాధారణ నాణ్యత కలిగిన ఒకే రకమైన సరుకులు అమ్మితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ప్రత్తిపాటి వ్యక్తం చేశారు. ఈసారి సమావేశానికి రిలయన్స్, కేపీఎంజీ వారిని కూడా పిలవమని అధికారులను ఆదేశించారు. రేషన్ డిపోలలో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఫొటో గుర్తింపు ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.
బంగారం నాణ్యత కనుగొనే 5 ల్యాబ్స్ ఏర్పాటు చేస్తాం
బంగారం అమ్మకాలలో హాల్ మార్క్ పేరుతో జరిగే మోసాలను సభ్యులు ప్రత్తిపాటి దృష్టికి తీసుకువచ్చారు. ఓ పెద్ద వ్యాపార సంస్థ అమ్మిన రెండు కిలోల బంగారంలో 650 గ్రాములు మాత్రమే స్వచ్ఛంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. హాల్ మార్క్ ఉన్నా అందులో స్వచ్ఛ మైన బంగారం ఎంత ఉందో వినియోగదారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సభ్యులు చెప్పారు. దీనిపై ప్రత్తిపాటి స్పందిస్తూ, రాష్ట్రంలో బంగారం నాణ్యత కనుగొనే 5 ల్యాబ్ లను త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీలను కూడా త్వరలో నియమిస్తామని మంత్రి చెప్పారు.
గ్యాస్ డెలివరీ చేసే వారికి అదనంగా చెల్లించవద్దు : కమిషనర్ రాజశేఖర్
గ్యాస్ డెలివరీ చేసే వారికి బిల్లు ప్రకారమే డబ్బు చెల్లించాలని, అదనంగా చెల్లించవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ బుదితి రాజశేఖర్ చెప్పారు. ఈ విషయంలో వినియోగదారులే వారిని నియంత్రించాలని కోరారు. గ్యాస్ సిలిండర్ ప్రమాదం వల్ల ఎవరైనా మరణిస్తే, మరణించిన ఒక్కొక్కరికి రూ.6 లక్షలు నష్టపరిహారంగా చెల్లిస్తామని చెప్పారు.
ప్రమాదం జరిగిన తీవ్రత మేరకు ఒక్కోసారి గరిష్ట స్థాయిలో రూ.30 లక్షల వరకు వైద్య ఖర్చులు, ఆస్తి నష్టానికి రూ.2 లక్షల వరకు నష్టపరిహారంగా చెల్లిస్తారని చెప్పారు. రేషన్ బియ్యంగానీ, ఇతర సరుకులు గానీ ఎన్ని నెలలు తీసుకోకపోయినా కార్డు రద్దు చేయరని, రద్దు చేస్తారన్న అపోహ వద్దని చెప్పారు. రాష్ట్రంలో కోటి 40 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, వాటిలో కోటి 9 లక్షల కార్డులు వాడుకలో ఉన్నట్లు తెలిపారు.
పక్కా ఇళ్లకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చినందువల్ల కిరోసిన్ రద్దు చేశామని, రేషన్ డిపో డీలర్లను చాలా వరకు నియమించామని, మరికొన్ని డీలర్ షిప్ ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని వివరించారు. చంద్రన్న విలేజ్ మాల్స్ మొదటి దశలో జూలై నాటికి ప్రతి జిల్లాలో 500 ఏర్పాటు చేస్తామని, వినియోగదారుల సంతృప్తిని తెలుసుకోవడానికి సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవకతవకలకు పాల్పడే రేషన్ డిపోలను రద్దు చేస్తామని, వినియోగదారులు ఏ సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 1100 కు కాల్ చేయవచ్చని తెలిపారు.
రేషన్ డిపోల ద్వారా పామాయిల్ ఇవ్వండి
రేషన్ డిపోల ద్వారా పామాయిల్ ఇవ్వాలని, జిల్లా, మండల స్థాయి విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు కోరారు. గ్యాస్ డెలివరి బాయిస్ ఒక్కో సిలిండర్ కు రూ.30 నుంచి రూ.40 వరకు అదనంగా డిమాండ్ చేస్తున్నారని, గిరిజన ప్రాంతాల్లో అయితే రూ.150 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. కొన్నిచోట్ల రేషన్ షాపులలో తూకం సరిగా తూయడంలేదని చెప్పారు.
బంగారు వస్తువులు, వస్త్రాలు, గిఫ్ట్ అర్టికల్స్, జనరిక్ మందుల ధరలు విపరీతంగా పెంచి అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఆస్పత్రులలో కూడా ఏ వైద్యానికి ఎంతో తెలియజేయకుండా దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఆస్పత్రులపై దృష్టిపెట్టాలని కోరారు. తూనికలు, కొలతల శాఖ వారు తనిఖీలు ఉద్ధృతం చేయాలని కోరారు. వినియోగదారులను చైతన్యవంతులను చేసేందుకు ఉపయోగపడే వినియోగ దీపిక పత్రికను ప్రతి నెల తీసుకురావాలని కోరారు. ఉత్తరాంధ్రలో చిన్న పిల్లలకు కూడా వయసు ధ్రువీకరించే ఆధార్ కార్డు చూపలేదని ఆర్టీసి వారు ఫుల్ టిక్కెట్ ఇస్తున్నారని చెప్పారు. వినియోగదారుల సంఘాలను కూడా పునరుద్ధరించి, సభ్యులను నియమించాలని కోరారు. గిరిజనులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఒక్కొక్కరికి 30 కిలోల బియ్యం ఇవ్వాలని కోరారు.