Jagan: ఇంటర్నెట్‌లో అద్భుతమైన బిల్డింగ్ కనపడితే చాలు, చంద్రబాబు వెంటనే డౌన్‌లోడ్ చేసేస్తారు!: జ‌గ‌న్ ఎద్దేవా

  • పత్రికల్లో రాజధాని బిల్డింగ్ అంటూ ఫొటో వేయించుకుంటారు
  • రాజధాని అలా ఉంటుందంటారు
  • ఇప్ప‌టికీ ఒక్క శాశ్వ‌త బిల్డింగ్ కూడా నిర్మించలేదు 
  • నాలుగేళ్లుగా అన్యాయం చేస్తున్నారు

అద్భుతమైన బిల్డింగ్ ఫొటో ఏదైనా ఇంటర్నెట్‌లో కనపడితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని వెంట‌నే డౌన్‌లోడ్ చేసేస్తారని, ఆ త‌రువాత ఆ ఫొటోను పత్రిక‌ల్లో వేయించుకుని అలా రాజ‌ధాని ఉంటుంద‌ని అంటార‌ని వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ ఎద్దేవా చేశారు.

రాజ‌ధాని క‌డుతున్నాన‌ని ఎన్నో మాట‌లు చెబుతూ ఇప్ప‌టికీ ఒక్క శాశ్వ‌త బిల్డింగ్ నిర్మాణం కూడా చేయ‌లేద‌ని చెప్పారు. ఈ రోజు గుంటూరు జిల్లా తాడికొండ నియోజ‌క వ‌ర్గం పేరేచెర్ల‌లో ఆయ‌న ర్యాలీలో మాట్లాడుతూ... త‌న రాష్ట్ర ప్ర‌జ‌లు బాగుండాలని ఏ సీఎం అయినా ఆలోచిస్తారని.. కానీ, చంద్ర‌బాబు మాత్రం ప్రజల గురించి పట్టించుకోకుండా రాజ‌ధాని ప్రాంతంలో త‌న బినామీల‌తో భూముల‌ను కొనుగోలు చేయిస్తున్నారని ఆరోపించారు.

చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా కాకుండా రియ‌ల్ ఎస్టేట్ బ్రోక‌ర్‌గా వ్యవహరిస్తున్నారని, రాజధాని పేరుతో దోచుకుంటున్నారని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. విదేశాల్లో అయితే చంద్ర‌బాబులాంటి వారిని జైలులో పెడతారని అన్నారు. నాలుగేళ్లుగా అన్యాయం చేస్తున్నారని, ఎవరైనా ప్రశ్నిస్తే వారిని రాజధాని నిర్మాణానికి, అభివృద్ధికి వ్యతిరేకులుగా చిత్రీక‌రిస్తూ ఎదురుదాడి చేస్తున్నారని చెప్పారు. నాలుగేళ్లుగా చంద్రబాబు చేయని మాయ, మోసం, చెప్పని అసత్యం లేవని విమ‌ర్శించారు.

రాజధాని పేరు చెప్పి చంద్ర‌బాబు చాలా సార్లు విదేశాలకు వెళ్లారని, ఓ సారి జ‌పాన్, మ‌రోసారి అమెరికా, టర్కీ, సింగ‌పూర్ ఇలా వెళుతుంటార‌ని, రాజ‌ధాని ఆకృతులు, నిర్మాణం అంటూ ఎన్నో మాట‌లు చెబుతుంటార‌ని జగన్ అన్నారు. ప్రజలను ఈ విధంగా మభ్యపెడుతున్నార‌ని, తాత్కాలిక సెక్ర‌టేరియ‌ట్, అసెంబ్లీ ఇలా అన్నీ తాత్కాలిక నిర్మాణాలే చేశారని, అస‌లు రాజ‌ధాని క‌ట్టే ఉద్దేశం చంద్ర‌బాబుకి ఉందా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. రాజ‌ధాని ఆకృతులంటూ ఓ సారి చంద్ర‌బాబు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని తీసుకొస్తారని, మ‌రోసారి మ‌రొక‌రిని తీసుకొస్తార‌ని, చివరకు రాజధాని నిర్మాణం మాత్రం చేయడం లేదని అన్నారు. 

  • Loading...

More Telugu News