Jagan: చంద్రబాబు నాయుడి రాజకీయ సూత్రాలేంటో మీకు తెలుసా?: జగన్

  • ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, తనకి బాగా తెలిసిన రాజకీయ సూత్రాన్ని చంద్రబాబు పాటిస్తున్నారు
  • 'ప్రజలను నమ్మించు, వంచించు' అనే సూత్రాన్ని మళ్లీ బయటకు తీశారు
  • ద్రోహం చేసి, వెన్నుపోటు పొడిచి ఆ తప్పును ఇతరులపైకి నెట్టుతున్నారు

రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఏపీ సీఎం చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏం జరిగిందో ప్రజలకి తెలుసని, ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా చంద్రబాబు మోసం చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు  గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ర్యాలీలో జగన్ మాట్లాడుతూ... రైతుల, పొదుపు సంఘాల, మహిళల రుణాలు మాఫీ చేస్తానని, కాపులను బీసీ జాబితాలో చేర్చుతానని, యువతకు ఉద్యోగాలు ఇస్తానని ఇలా ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు.

చంద్రబాబు నాయుడి రాజకీయ సూత్రాలేంటో మీకు తెలుసా? అని జగన్ ప్రశ్నించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అంతా మోసమని, ఇది తెలుసుకున్న ప్రజలు నిలదీస్తోంటే చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిందని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తనకి బాగా తెలిసిన రాజకీయ సూత్రాన్ని చంద్రబాబు పాటిస్తున్నారని అన్నారు. ప్రజలను నమ్మించు, వంచించు అనే సూత్రాన్ని మళ్లీ బయటకు తీశారని, ప్రజలకు ద్రోహం చేసి, వెన్నుపోటు పొడిచి ఆ తప్పును ఇతరుల పైకి నెట్టుతున్నారని అన్నారు. దీని కోసం తన అనుకూల మీడియాను బాగా చక్కగా వాడుకుంటున్నారని, మొసలి కన్నీరు పెడుతున్నారని తెలిపారు. ఇవే చంద్రబాబు రాజకీయ సూత్రాలని చెప్పారు.

ఆరు నెలలుగా చంద్రబాబు నోటి నుంచి కొన్ని మాటలు వస్తున్నాయని, తనని బలహీనపర్చడం అంటే రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను బలహీన పర్చడమని చంద్రబాబు చెప్పుకుంటున్నారని జగన్ అన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఇలా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. 'చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమంపై దశ, దిశ చెబుతారట, అఖిల పక్షాన్ని పిలిచారట. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. దొంగోడే దొంగ దొంగ అని అరుస్తున్నట్లు ఉంది. ప్రత్యేక హోదా ఇప్పుడు మీకు గుర్తు కొచ్చిందా? అఖిలపక్షాన్ని పిలవాలన్న ఆలోచన ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఆ నాడు అర్ధరాత్రి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలో ఇటీవల అదే జైట్లీ చేసిన ప్రకటనలో తేడా ఏముంది?' అని జగన్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News