Chandrababu: ‘అవిశ్వాసం’పై చర్చ రాష్ట్రానికి ఎంతో ముఖ్యం : సీఎం చంద్రబాబు
- టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
- అవిశ్వాసంపై చర్చకు గట్టిగా పట్టుబట్టాలి
- లాటరీ పద్ధతిలో ‘అవిశ్వాసం’పై చర్చ చేపట్టే అవకాశం ఉంది
- రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జాతీయ స్థాయిలో వినిపించాలి
ఇది చాలా కీలక సమయమని, అవిశ్వాస తీర్మానంపై చర్చ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమని తమ పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. టీడీపీ ఎంపీలతో ఈరోజు సాయంత్రం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీలు, అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం లు కేంద్రంపై అవిశ్వాస నోటీసులు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. రేపు లోక్ సభలో ఎంపీలందరూ అవిశ్వాసంపై చర్చకు గట్టిగా పట్టుబట్టాలని తమ ఎంపీలకు సూచించారు. లాటరీ పద్ధతిలో అవిశ్వాసం తీర్మానంపై చర్చ చేపట్టే అవకాశం ఉందని, ముందుగా ఏ పార్టీ అయితే అవిశ్వాస నోటీసు ఇచ్చిందో దానిపై చర్చ చేపట్టవచ్చని అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జాతీయ స్థాయిలో వినిపించాలని, నాలుగేళ్లయినా విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకపోవడాన్ని ప్రశ్నించాలని తమ పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశించారు. ఏపీకి పార్లమెంట్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని నిలదీయాలని, అవసరమైన సమాచారాన్ని ఎంపీలకు అందుబాటులో ఉంచుతామని అన్నారు. అన్నింటి యూసీలు ఇచ్చినందునే తర్వాత విడత నిధులు ఏపీకి ఇచ్చారని, ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకోవడం సబబేనా అని ప్రశ్నించాలని పార్టీ నేతలతో చంద్రబాబు చెప్పారు.