Congress: కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ సభ్యత్వాలు రద్దు.. గెజిట్ నోటిఫికేషన్ జారీ
- తెలంగాణ అసెంబ్లీలో 2 స్థానాలు ఖాళీ అయినట్టు నోటిఫికేషన్
- ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు సమాచారం
- స్వామిగౌడ్ పై దాడి ఘటనలో మరో ఇద్దరిపై వేటు పడే అవకాశం?
తెలంగాణ అసెంబ్లీలో నిన్న జరిగిన సంఘటన నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేశారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. తెలంగాణ అసెంబ్లీలో 2 స్థానాలు ఖాళీ అయినట్టు ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు తెలంగాణ అసెంబ్లీ సమాచారమిచ్చింది.
కాగా, తెలంగాణ అసెంబ్లీలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పై దాడి ఘటనలో మరో మలుపు చోటుచేసుకున్నట్టు సమాచారం. దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ని స్పీకర్ మరోసారి పరిశీలించినట్టు తెలుస్తోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలూ కూడా స్వామిగౌడ్ పై హెడ్ ఫోన్స్ విసిరినట్టుతెలుస్తోంది. ఆ ఇద్దరిపై కూడా బహిష్కరణ వేటు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, నిన్న తెలంగాణ అసెంబ్లీలో నిరసనలు తెలుపుతూ కాంగ్రెస్ సభ్యులు హెడ్ ఫోన్స్ ను విసిరేసిన ఘటనపై టీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసన సభ్యత్వాలపై వేటు వేస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ దాన్ని ఆమోదించింది.