Chandrababu: కొంతకాలం వేచి చూద్దాం: నేతలకు సంకేతాలిచ్చిన చంద్రబాబు!
- ఇప్పటికిప్పుడు పొత్తును వదులుకోవద్దు
- పార్లమెంట్ సమావేశాలు ముగిసేవరకూ వేచి చూద్దాం
- వ్యూహ కమిటీ నేతలతో చంద్రబాబు
బీజేపీతో పొత్తును వదులుకునే విషయమై మరి కొంతకాలం పాటు వేచి చూసే ధోరణిని అవలంభించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తమ నేతల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటీతో చంద్రబాబు సమావేశం అయిన వేళ, ఎన్డీయే నుంచి బయటకు వద్దామన్న అభిప్రాయం నేతల నుంచి వ్యక్తం కాగా, చంద్రబాబు వారించినట్టు సమాచారం. కేంద్ర మంత్రి పదవులనే వదులుకున్న తరువాత, ఇంకా ఎన్డీయేలోనే ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని కొందరు పార్టీ నేతలు వ్యాఖ్యానించగా, కేంద్ర పదవులకు రాజీనామా చేసి మనం పెద్ద సాహసాన్నే చేశామని, దీంతో విషయం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిందని గుర్తు చేసిన చంద్రబాబు కేంద్రానికి కొంత సమయం ఇచ్చి చూద్దామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనను ఢిల్లీకి ఆహ్వానించారని చెప్పిన చంద్రబాబు, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ వేచి చూసి, ఆపై మరోసారి భేటీ అయి తదుపరి నిర్ణయంపై ఆలోచిద్దామని, ప్రస్తుతానికి పార్లమెంట్ వేదికగా మరింత నిరసనలు తెలిపేలా వ్యూహాన్ని రచిద్దామని చెప్పినట్టు తెలుస్తోంది.