TRS: అత్యధిక అప్పులు ఉన్న ప్రాంతీయ పార్టీల్లో.. మొదటి రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్, టీడీపీ
- దేశంలో అతి సంపన్న ప్రాంతీయ పార్టీగా సమాజ్ వాదీ పార్టీ
- రెండో స్థానంలో తమిళనాడుకు చెందిన ప్రతిపక్ష డీఎంకే
- 2015-16 ఏడాదికి టీఆర్‌ఎస్‌కు రూ.15.97 కోట్ల అప్పు
- టీడీపీకి రూ.8.18 కోట్ల అప్పు
దేశంలో ప్రాంతీయ పార్టీలు అధికంగానే ఉన్నాయి. దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలదే హవా. దేశంలో సంపన్న ప్రాంతీయ పార్టీల గురించి వివరిస్తూ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా జాబితా విడుదల చేసింది. అందులో ఉత్తర ప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ రూ.634.96 కోట్ల నగదు ఆస్తులతో అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడుకు చెందిన ప్రతిపక్ష డీఎంకే పార్టీ రూ.257.18 కోట్ల సంపదతో రెండో స్థానంలో, అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ రూ.224.84 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి.
2011తో పోలిస్తే సమాజ్ వాదీ పార్టీ ఆస్తులు ఇప్పుడు 198 శాతం పెరగగా, డీఎంకే ఆస్తులు 155 శాతం పెరిగాయని అందులో పేర్కొంది. అలాగే, ఆయా పార్టీలకు ఉన్న అప్పుల వివరాలను కూడా అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) వివరించింది. అప్పుల్లో తెలంగాణ అధికార పార్టీ టీఆర్‌ఎస్ (2015-16 ఏడాదికి టీఆర్‌ఎస్‌కు రూ.15.97 కోట్ల అప్పు) తొలిస్థానంలో, ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ (రూ.8.18 కోట్లతో) రెండో స్థానంలో ఉన్నాయి.