Chandrababu: బీజేపీతో కటీఫ్... సుజనా, అశోక్ గజపతిరాజు రాజీనామా
- సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన చంద్రబాబు
- సుదీర్ఘ చర్చల తరువాత కీలక నిర్ణయం
- న్యాయం జరుగుతుందనే ఇంతకాలం బీజేపీతో దోస్తీ
- ఇక వైదొలగడమే సబబన్న చంద్రబాబు
అందరూ ఊహిస్తున్నట్టుగానే తెలుగుదేశం పార్టీ, బీజేపీ మధ్య బంధం తెగిపోయింది. బుధవారం సాయంత్రం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం తరువాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోగా, రాష్ట్రాన్ని ఆదుకునే ఉద్దేశం ఏమాత్రం లేని బీజేపీతో పొత్తు, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అక్కర్లేదన్న భావనకు వచ్చానని రాత్రి 10.30 గంటల తరువాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మీడియాకు వెల్లడించారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని, ప్యాకేజీకి కూడా కొర్రీలు పెట్టిన భాగస్వామితో ఇక కలిసుండటం కుదరదని తేల్చి చెప్పారు.
ప్రజల హక్కుల కోసమే తాను పోరాడుతున్నానని, నాడు ఇచ్చిన హామీల్లో తాను కూడా భాగస్వామినన్న విషయాన్ని బీజేపీ మరచిపోయిందని నిప్పులు చెరిగారు. నాడు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నేతలు కూడా డిమాండ్ చేశారన్న విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు, ఇప్పుడు ఇతర రాష్ట్రాల సెంటిమెంట్‌ను బూచిగా చూపించడం ఏంటని ప్రశ్నించారు. విభజన హామీలన్నీ నెరవేర్చాలని తాను ఎంతగానో పోరాడానని, కేంద్రమంత్రులు రాజీనామా చేసే విషయమై ఇప్పటికే సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులతో సుదీర్ఘంగా మాట్లాడానని, వారు కూడా తన అభిప్రాయాన్ని గౌరవించారని అన్నారు.