Andhra Pradesh: 'తక్షణమే బీజేపీతో తెగదెంపులు చేసుకుందాం'.. చంద్రబాబుకు స్పష్టం చేసిన టీడీపీ నేతలు
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు చర్చ
- కేంద్ర ప్రభుత్వ తీరు, కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనలపై తీవ్ర అసంతృప్తి
- తక్షణమే ఏవైనా నిర్ణయాలు తీసుకుందామా? అని అడిగిన చంద్రబాబు
- చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెనకాలే ఉంటాం: టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'తక్షణమే ఏవైనా నిర్ణయాలు తీసుకుందామా? కొంత కాలం వేచి చూసి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తూ ఒత్తిడి పెంచుదామా?' అని చంద్రబాబు తమ నేతలను అడిగారు.
బీజేపీతో తక్షణమే తెగదెంపులు చేసుకుందామని మెజార్టీ సభ్యులు చంద్రబాబుకి సూచించినట్లు తెలిసింది. మరి కొంతకాలం ఆగుదామని కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే అన్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం ఏది తీసుకున్నా ఆయన వెంటే ఉంటామని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్పారు. కాగా, రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో చంద్రబాబు నాయుడు పలు కీలక విషయాలు వెల్లడిస్తానని తెలిపినట్లు సమాచారం.