kcr: కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టు కనిపిస్తోంది: వీహెచ్
- కేసీఆర్ మూడో ఫ్రంట్ పెడితే వచ్చేవాళ్లెవరున్నారు?
- ఆ ఫ్రంట్ లో కేసీఆర్ ఒక్కరే మిగిలిపోతారు!
- వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 16 సీట్లు కూడా రావు
- మీడియాతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్
దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమి ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, అందుకు తానే నడుం బిగిస్తానని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు (వీహెచ్) స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ మూడో ఫ్రంట్ పెడితే వచ్చేవాళ్లెవరున్నారని ప్రశ్నించారు. ఒకవేళ మూడో ఫ్రంట్ కనుక ఏర్పాటు చేస్తే ఆ ఫ్రంట్ లో కేసీఆర్ ఒక్కరే మిగిలిపోతారని, ఎంఐఎం సంతోషం కోసమే బీజేపీకి కేసీఆర్ దూరమవుతున్నారని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 16 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ సత్తా ఏంటో తెలుసుకోవాలని, ఆ తర్వాతే దేశ రాజకీయాలపై మాట్లాడాలని సూచించారు. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టు కనిపిస్తోందని విమర్శించిన వీహెచ్, కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రకు స్పందన రాకుంటే కేసీఆర్ కు ఎందుకు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బస్సు యాత్రకు భయపడే కేసీఆర్ అలా మాట్లాడుతున్నారని, తన పనైపోయిందని భావిస్తున్న కేసీఆర్ రాష్ట్రంలో వరుస సర్వేలు చేయించుకుంటున్నారని విమర్శించారు.