devaraju: ప్రముఖ రచయిత, సినీ సమీక్షకుడు దేవరాజు రవి కన్నుమూత

  • 1959లో రామం అనే నవలతో ప్రారంభమైన ఆయన రచనలు
  • 12 నవలలు, 200 పైగా కథ‌లు, 1250 సినిమా సమీక్షలు రాసిన దేవరాజు రవి
  • సితార, శివరంజని, మేఘ సందేశం సినిమా పత్రికలలో సమీక్షలు 
  • ఎంతోమంది రోగులకు స్వయంగా సేవ చేసిన సాంఘిక సేవా కార్యకర్త

ప్రముఖ కథకుడు, నవలాకారుడు, సినిమా సమీక్షకుడు, సాంఘిక సేవా కార్యకర్త దేవరాజు రవి.. ఈ రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ మేడిపల్లిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఉదర సంబంధిత కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు వున్నారు. దేవరాజు రవి 12 నవలలు, 200 పైగా కథ‌లు, 1250 సినిమా సమీక్షలు, పలు ఇతర వ్యాసాలూ రాశారు. 1959లో 'రామం' అనే నవలతో ప్రారంభమైన ఆయన రచనలు చివరి రోజు వరకు కొనసాగాయి.

ప్రముఖ పాత్రికేయుడు ఎ.బాలరెడ్డి సంపాదకత్వంలో వెలువడుతున్న 'దైవం' పత్రికలో మొన్నటి వరకు దేవరాజు రవి పలు ఆధ్యాత్మిక రచనలు కూడా చేశారు. ఈయన మూడు కవితా సంపుటాలు, రెండు కథా సంపుటాలు వెలువరించారు. సితార, శివరంజని, మేఘ సందేశం, నంబర్ వన్ సినిమా పత్రికలలో ఆయన చేసిన సమీక్షలు విశేషంగా పాఠకుల్ని ఆకట్టుకోవడమేకాక నిష్పక్షపాత సమీక్షలు కావడంతో సినీ వర్గాల ప్రశంసల్ని సైతం పొందాయి. టీవీ నంది అవార్డుల కమిటీలో ఆయ‌న‌ రెండుసార్లు సభ్యుడిగా ఉన్నారు.

దేవరాజు రవి తండ్రి దేవరాజు వెంకట కృష్ణారావు (తెలుగులో తొలి డిటెక్టివ్ నవల 'వాడే వీడు' రచయిత‌).  వీరి స్వస్థలం బరంపురం. దేవరాజు రవి సుప్రసిద్ధ సాంఘిక కార్యకర్త. కుష్టువ్యాధి నిర్మూలనకు విశేషంగా కృషి చేశారు. ఎంతోమంది రోగులకు స్వయంగా సేవ చేశారు. కుష్టు వ్యాధి రోగగ్రస్తులకు సేవ చేసే ఉద్దేశంతో ఏరికోరి లెప్రసీ శాఖలో ఉద్యోగం చేసి, పదవి విరమణ అనంతరం సైతం ఆ సేవల్ని కొనసాగించారు. రేపు హైదరాబాద్ లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News