Andhra Pradesh: ఏ పార్టీతోనూ టీటీడీపీ విలీనం జరగబోదు: చంద్రబాబు
- హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ నేతలతో సమావేశం
- ఇతర పార్టీలతో టీడీపీని విలీనం చేసే ప్రసక్తే ఉండదు
- పార్టీ శ్రేయస్సు కోసం ఇతర పార్టీలతో పొత్తు : చంద్రబాబు
తెలంగాణలో టీడీపీని ఇతర పార్టీలతో విలీనం చేస్తారనే ఊహాగానాలకు తెరపడింది. ఏ పార్టీలోనూ టీటీడీపీ విలీనం జరగబోదని ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ నేతలతో ఈరోజు సమావేశం జరిగింది. ఈ భేటీలో పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇతర పార్టీలతో టీడీపీని విలీనం చేసే ప్రసక్తే ఉండదని అన్నారు. పార్టీని విలీనం చేస్తామని వ్యాఖ్యలు చేసే అధికారం, స్వేచ్ఛ ఎవరికీ లేవని, టీడీపీ చిరస్థాయిగా ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ శ్రేయస్సు కోసం కొన్నిసార్లు ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకోవడం జరుగుతుందని, పార్టీ మనుగడ కోసం కార్యకర్తలు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని సూచించారు. అన్ని స్థాయిల్లో పార్టీ నాయకులను త్వరలోనే నియమిస్తామని, కొంతమంది నాయకులు పార్టీని వీడినా పెద్దనష్టమేమీ లేదని అన్నారు.