KCR: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ నుంచి రైతాంగం పోరు ప్రారంభిస్తుంది: సీఎం కేసీఆర్
- దేశంలో రైతులు సహనం కోల్పోతున్నారు
- రైతులకు మద్దతు ధర పెంచే ధైర్యం ప్రధాని మోదీకి లేదు
- మార్చి 5 నుంచి మా ఎంపీలు ఆందోళన చేస్తారు
- కరీంనగర్ లో రైతుల సదస్సులో కేసీఆర్
కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ నుంచి రైతాంగం పోరు ప్రారంభిస్తుందని, ఈ పోరుకు అన్ని రాష్ట్రాలు కలిసి రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు నిచ్చారు. కరీంనగర్ లో నిర్వహించిన రైతుల సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, దేశంలో రైతుల దుస్థితికి కారణం గత ప్రభుత్వాలు అవలంబించిన విధానాలేనని, దేశాన్ని, రాష్ట్రాన్ని గతంలో పాలించిన పార్టీలు ఇప్పుడు రోడ్డెక్కి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
కేంద్ర బడ్జెట్ లో రైతుల కోసం నిధులు కేటాయించలేదని, దేశంలో రైతులు సహనం కోల్పోతున్నారని అన్నారు. రైతులకు మద్దతు ధర పెంచే ధైర్యం ప్రధాని నరేంద్ర మోదీకి లేదని, మార్చి 5 నుంచి పార్లమెంట్ లో తమ పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తారని, రైతు సమస్యలపై టీఆర్ఎస్ ఎంపీలు గట్టిగా పోరాడాలని అన్నారు. జాతీయ ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సూచించిన కేసీఆర్, కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని డిమాండ్ చేశారు.