raghveera reddy: మార్చి 6 నుంచి ఢిల్లీలోనే ఉండి తాడోపేడో తేల్చుకుంటాం : ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి
- మార్చి 6, 7 తేదీల్లో ఢిల్లీలో దీక్ష
- 8న పార్లమెంట్ ముట్టడి
- పార్టీలకతీతంగా అందరూ కలసి రావాలి
- రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు రఘువీరా విజ్ఞప్తి
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం .. మన హక్కులను సాధించుకుందామని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రబడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనకు, నిరసనకు దిగుతున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలో మార్చి 6, 7, 8 తేదీల్లో ఢిల్లీలోనే ఉండి తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కలసి వెళదామని, అందరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను ఆహ్వానిస్తున్నామని, ఢిల్లీ వెళ్లి దీక్ష చేద్దామని అన్నారు.
మార్చి 6, 7 తేదీల్లో ఢిల్లీలో దీక్ష చేద్దామని, 8వ తేదీన పార్లమెంట్ ను ముట్టడిద్దామని పేర్కొన్నారు. మార్చి 2వ తేదీన ‘మనందరం ఒక్కటవుదాం’ అంటూ రాజకీయపార్టీలకు, ప్రజా సంఘాల నేతలను కోరారు. కాగా, ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్ కార్యాలయాల ముందు ఒకరోజు ‘ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష’ చేపడుతున్నట్టు చెప్పారు.