Telangana: బోదకాలు బాధితులకు ప్రతి నెలా పింఛన్ ఇస్తాం: సీఎం కేసీఆర్
- ఆరోగ్య శాఖపై సమీక్షించిన కేసీఆర్
- వచ్చే ఆర్థిక సంవత్సరం పింఛన్ ఇస్తాం
- ప్రజారోగ్యం విషయంలో మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలి
- కేసీఆర్ కిట్స్ పథకం చక్కగా అమలవుతోంది: కేసీఆర్
తెలంగాణలోని బోదకాలు బాధితులకు ప్రతి నెలా రూ. 1000 పింఛన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శాఖపై ఈరోజు ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని నలభై ఏడు వేల మంది బోదకాలు బాధితులకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పింఛన్ ఇవ్వనున్నామని, వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని తెలిపారు.
ప్రభుత్వ ఖర్చుతోనే రోగ నిర్ధారణ పరీక్షలు చేయించాలని, గ్రామస్థాయిలో పని చేసే వైద్యాధికారులు, సిబ్బంది సేవలను వినియోగానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. పేదల ఆరోగ్యం కాపాడడం కన్నా మించిన ప్రాధాన్యత తమ ప్రభుత్వానికి ఏదీ లేదని అన్నారు. ప్రజారోగ్యం విషయంలో మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. కాగా, బోదకాలు బాధితులను ఆదుకోవాలని మంత్రి తుమ్మల, ఎంపీ కవిత ఇటీవల సీఎంను కోరారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తాజా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఆశా వర్కర్లకు మరోసారి జీతాలు పెంచుతాం
ఆశా వర్కర్లకు మరోసారి జీతాలు పెంచాలని, అలాగే, సెకండ్ ఏఎన్ఎంలకు కూడా జీతాలు పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కిట్స్ పథకం గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ పథకం చక్కగా అమలవుతోందని అన్నారు. ఈ కిట్స్ ప్రైవేటు ఆసుపత్రులకు లేవని, ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలను, సిబ్బందిని పెంచుతున్నట్టు చెప్పిన కేసీఆర్, వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహకాలు అందజేస్తామని చెప్పారు.