Andhra Pradesh: మూడు నగరాల్లో భారీ స్థాయి కుటుంబ వినోద కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన

  • ఆర్థిక మంత్రి యనమల సమీక్ష
  • విశాఖ, విజయవాడ, తిరుపతిలలో మూడు ఎఫ్ఈసీలు
  • కాకినాడ, చీరాలలో రిసార్ట్ లు

విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో భారీ స్థాయి కుటుంబ వినోద కేంద్రాల (ఎఫ్ఈసీ-ఫ్యామిలీ ఎంటర్ టెయిన్ మెంట్ సెంటర్ల) ఏర్పాటును ఏపీ పర్యాటక శాఖ అధికారులు ప్రతిపాదించారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన ఈ రోజు సమీక్ష నిర్వహించారు. పట్టణాభివృద్ధి విధానాల సంస్కరణపై మంత్రి మండలి ఉప సంఘం సమావేశం, పర్యాటక శాఖ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో ప్రతిపాదించిన మూడు ఎఫ్ఈసీలు, కాకినాడలో రిసార్ట్, ప్రకాశం జిల్లా చీరాలలోని ఓడరేవు సమీపంలో రిసార్ట్ గురించి పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వివరించారు. విశాఖ ఎఫ్ఈసీలో ఒక ఐమాక్స్ థియేటర్, 8 వెండితెరల మల్టీప్లెక్స్, రెండు వేల సీట్ల సామర్ధ్యం గల ఒక కాన్ఫరెన్స్ హాల్ (ఎంఐసీఈ - మీటింగ్,ఇన్ సెంటివ్స్, కన్వెన్షన్స్, ఈవెంట్స్), 50వేల అడుగుల వాణిజ్య స్థలం, త్రీ స్టార్ హోటల్ ఉంటాయని తెలిపారు. విజయవాడలోని ఎఫ్ఈసీలో ఒక ఐమాక్స్ థియేటర్, 8 వెండితెరల మల్టీప్లెక్స్, రెండు వేల సీట్ల సామర్ధ్యం గల ఎంఐసీఈ, 50 వేల అడుగుల వాణిజ్య స్థలం, త్రీస్టార్ హోటల్, తిరుపతిలోని ఎఫ్ఈసీలో ఒక ఐమాక్స్ థియేటర్, 6 వెండితెరల మల్టీప్లెక్స్, రెండు వేల సీట్ల సామర్ధ్యం గల ఎంఐసీఈ, 80 వేల అడుగుల వాణిజ్య స్థలం, త్రీస్టార్ హోటల్  ఉంటాయని వివరించారు. కాకినాడలో మొత్తం పది ఎకరాల స్థలంలో ఓ రిసార్ట్ ఏర్పాటు చేసి, అక్కడ వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రాజెక్టులకు వంద నుంచి 150 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పర్యాటక శాఖకు సంబంధించి మూడు కేటగిరీలుగా విభజించిన 9 అంశాలను పర్యాటక శాఖ కమిషనర్ హిమాన్షు శుక్లా వివరించారు.

ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, ఏ ప్రాజెక్టులైనా నిర్ణయించిన సమయానికి పూర్తి కాకపోతే వారికి ఇచ్చిన భూములను తప్పనిసరిగా వెనక్కి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ఏవైనా ప్రాజెక్టులు గిరిజనేతరులు చేపట్టడానికి నిబంధనలు అనుమతించనందువల్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో సొసైటీలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.

ఏపీ టూరిజం బోర్డు ఏర్పాటు, మహేంద్ర సంస్థకు శ్రీకాకుళంలో స్థలం కేటాయింపు, తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో పర్యాటక ప్రాజెక్టు, అక్కడి ఐలాండ్, పలు పర్యాటక ప్రాజెక్టులు, ఏపీటీడీసీ ప్రాజెక్టులు, అరసవల్లి, కుప్పం, తోటకొండ, ఎర్రకాలు భూముల కేటాయింపు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశాల్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News