YSRCP: ప్రత్యేకహోదా ముగిసిన అంశం: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
- ‘హోదా’పై రాజకీయాలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదు
- ఆ అంశం పట్టుకుని పొత్తులు పెట్టుకునే పరిస్థితిలో లేము: వీర్రాజు
- ఎన్డీయేకు ఎవరు మద్దతు ఇచ్చినా స్వాగతిస్తాం: మాణిక్యాలరావు
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కనుక బీజేపీకి మద్దతు ఇస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు పలు విమర్శలు గుప్పించారు.
తాజాగా, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై రాజకీయాలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదని, హోదా అంశం పట్టుకుని పొత్తులు పెట్టుకునే పరిస్థితిలో బీజేపీ లేదని అన్నారు. ఇదే విషయమై బీజేపీకి చెందిన ఏపీ మంత్రి మాణిక్యాలరావు స్పందిస్తూ, ఎన్డీయేకు ఎవరు మద్దతు ఇచ్చినా స్వాగతిస్తామని, వేరే పార్టీల గురించి ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని, అయినప్పటికీ తమకు మద్దతు ఇస్తామంటే స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందని అన్నారు.