Chandrababu: సిమెంట్ రోడ్లతో మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి: సీఎం చంద్రబాబు
- ఒక సమస్యను పరిష్కరిస్తుంటే మరో సమస్య వస్తోంది
- బురద అవుతోందని సిమెంట్ రోడ్లు నిర్మిస్తుంటే మోకాళ్ల నొప్పులు
- ఆరోగ్యం దెబ్బతింటుందనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి
- ఒకరోజు టీడీపీ వర్క్ షాప్ లో చంద్రబాబు
ఒక సమస్యను పరిష్కరిస్తుంటే మరో సమస్య వస్తోందని, గ్రామాల్లో బురద అవుతోందని సిమెంట్ రోడ్లు నిర్మిస్తుంటే మోకాళ్ల నొప్పులు వస్తున్నాయని, ఆరోగ్యం దెబ్బతింటుందనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఒకరోజు టీడీపీ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ, నేడు అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వస్తున్నాయని, మట్టి రోడ్లు కనిపించడం లేదని అన్నారు.
‘నేను మా ఊరు వెళ్లినప్పుడు చూస్తే..అక్కడ రోడ్లు అన్నీ సిమెంట్ రోడ్లుగా మారాయని, ఎక్కడా ఒక మట్టిరోడ్డు కూడా కనిపించడం లేదని అన్నారు. గ్రామాల్లో అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు కావడంతో మోకాళ్ల నొప్పుల సమస్య తలెత్తుతుందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన జరిగిన తీరుపై మరోమారు ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించడం వల్లే ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయిందని విమర్శించారు. విభజన కష్టాలు ఎలా ఇబ్బంది పెడుతున్నాయో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించినట్టు చెప్పారు. వృద్ధి రేటులో ముందు ఉన్నప్పటికీ, తలసరి ఆదాయం విషయంలో మాత్రం ఏపీ చాలా వెనుకబడి ఉన్నట్టు చంద్రబాబు చెప్పారు.