Chandrababu: ఏపీ ప్రజలు చేతగాని వాళ్లేం కాదు: చంద్రబాబు కీలక వ్యాఖ్య
- కేసీఆర్ వ్యాఖ్యలపై మరోసారి మండిపడ్డ చంద్రబాబు
- ప్రజల అభిప్రాయాన్ని అడగకుండా విభజించారు
- న్యాయం చేయాలని అడుగుతుంటే పట్టించుకోవడం లేదు
- కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
హైదరాబాద్ లో నిన్న జరిగిన 'ఇండియా టుడే కాంక్లేవ్'లో తెలంగాణను ఏపీతో పోల్చవద్దని, ఏపీ పాలకుల వల్లే తెలంగాణ వెనుకబడిందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కలెక్టర్ల సదస్సులో మరోసారి ప్రస్తావించిన చంద్రబాబు, ఈసారి కాస్త ఘాటుగా స్పందించారు. ఈ ఉదయం రెండో రోజు సదస్సు ప్రారంభంకాగా, పలువురు ఉన్నతాధికారులు కేసీఆర్ మాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆపై మరోసారి మాట్లాడిన చంద్రబాబు, ఏపీ ప్రజలు చేతగాని వాళ్లేం కాదని అన్నారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాన్ని మాట మాత్రమైనా అడగకుండానే రాష్ట్రాన్ని విడదీశారని ఆరోపించిన ఆయన, ప్రజల ప్రమేయం లేకుండానే విభజన జరిగిపోయిందని చెప్పారు. అన్ని వర్గాలతో మాట్లాడి ముందడుగు వేయాలని, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని తాను అడుగుతుంటే, కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయం జరిగిందని అంగీకరిస్తున్న వారు, న్యాయం చేసేందుకు ఆలస్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్నవే తాము అడుగుతున్నామని స్పష్టం చేశారు.